మొన్న నెల్లూరు.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ ముట్టుకోవాలంటేనే మాంసం ప్రియులు వణికిపోయేలా చేస్తోంది. ఈ ఫ్లూ దెబ్బకు.. ఫౌల్ట్రీ ఇండస్ట్రీ విలవిలలాడుతోంది. మూడు గుడ్లు ఆరు కోళ్లు అన్నట్టుగా సాగిన వ్యాపారం కాస్తా.. కొక్కెర తగిలిన కోడిలా ఒక్కసారిగా ఢీలా పడింది. ఏపీలో బర్డ్ ఫ్లూ అలజడి రేపుతోంది. వారం క్రితం నెల్లూరు జిల్లాలో బయటపడిన ఈ ఫ్లూ ఇప్పుడు చిత్తూరుకు పాకింది. రోజూ వందలకొద్దీ కోళ్లు చనిపోతుండటంతో.. చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు విధించారు అధికారులు. దీంతో పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. అటు వ్యాపారులు సైతం నష్టపోయే పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37,089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు.
లేటెస్ట్‌గా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఫౌల్ట్రీ వాహనాలను చెక్‌పోస్టుల దగ్గర అధికారులు నిలిపివేస్తుండటంతో.. రోజుకి 5కోట్ల వ్యాపారం ఆగిపోతోందంటూ పౌల్ట్రీ రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.రోజువారీగా బెంగళూరు పాండిచ్చేరి, చెన్నైలకు కోళ్లు, కోడిగుడ్లు ఎగుమతులు చేస్తున్న చిత్తూరు జిల్లాలోని హెచరీస్ సంస్థలు ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీ ఉత్పత్తులను అనుమతించని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తీరు ఇబ్బందిగా మారింది. దీంతో బార్డర్ చెక్ పోస్టుల దగ్గరే పౌల్ట్రీ రంగం ఉత్పత్తులను రవాణా చేస్తున్న వాహనాలు నిలిచిపోతున్నాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో యంత్రాంగం కూడా అలెర్ట్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. పిపిఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచింది.
పశువైద్య సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. చికిత్స, టీకా లేని బర్డ్ ఫ్లూ ను కేవలం నివారించడం ఒక్కటే మార్గం అంటోంది ప్రభుత్వ యంత్రాంగం. వైరస్ బయటపడిన నెల్లూరు జిల్లా నుంచి పౌల్ట్రీ ఎగుమతులను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.