క్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని మార్చి 13 తరవాత విడుదల చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియంతా పూర్తైన వెంటనే షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తరవాత యూపీ, జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తుంది. మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకుని ఆ వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది ఈసీ. పలు ప్రాంతాల్లోని సమస్యలు, ఈవీఎమ్‌లు తరలించేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఇతరత్రా భద్రతా పరమైన సమస్యలపై చర్చించింది. నిఘా పెంచాలని అధికారులను ఆదేశించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో త్వరలోనే ఈసీ బృందాలు పర్యటించనున్నాయి.
మార్చి 13వ తేదీన జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తాయని తెలుస్తోంది. ఓటర్ల సంఖ్యని 97 కోట్లుగా తేల్చి చెప్పింది ఈసీ. వీళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని వెల్లడించింది 2019తో పోల్చి చూస్తే ఓటర్ల సంఖ్య 6% మేర పెరిగింది. కొద్ది రోజుల క్రితమే ఓటర్ల జాబితాని పబ్లిష్ చేసింది. ఈ సారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే వాటిని తొలగించేందుకు ఈ AI టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డివిజన్‌ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇలాంటి పోస్ట్‌లను తొలగించినప్పటికీ పదే పదే వాటిని ప్రచారం చేసినా…ఈసీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆయా పార్టీల సోషల్ మీడియా అకౌంట్‌లను సస్పెండ్ చేస్తామని తేల్చి చెబుతున్నారు. వీటితో పాటు ఫ్యాక్ట్ చెకింగ్‌పైనా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. భద్రతాపరమైన సమస్యలు రాకుండా ఇలాంటి వార్తలకి కళ్లెం వేయనుంది.ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవలే కీలక విషయాలు వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. ఈ క్రమంలోనే ఒడిశా ఎన్నికల గురించి మాట్లాడారు రాజీవ్ కుమార్. దాదాపు 50% మేర పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.”ఒడిశాలోని 50% మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పిస్తాం. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 37809 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తాం. అందులో 22,685 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుంది. దివ్యాంగులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 300 పోలింగ్ బూత్‌లను దివ్యాంగులే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం”
-సీఈసీ రాజీవ్ కుమార్