తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. అందుకు కారణం ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడిపేరు ఎఫ్ఐఆర్ కాపీలో ఉండటమే. గతంలో పలువురు ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపించగా… ఈసారి ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ దర్శకుడు క్రిష్ పేరు రావడంతో సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందడంతో రాడిసన్ హోటల్ కు వెళ్లామని, అక్కడ రాడిసన్ హోటల్ అధినేత గజ్జల యోగానంద్ కుమారుడు వివేకానంద్ స్నేహతులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు తెలిసిందని, తర్వాత అతణ్ణి విచారించగా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.ఎఫ్ఐఆర్ కాపీలో క్రిష్ పేరును 8వ వ్యక్తిగా చేర్చారు. అయితే… డ్రగ్స్ కేసు పట్ల ఓ న్యూస్ ఛానల్‌తో క్రిష్ మాట్లాడారు. తాను హోటల్‌కు వెళ్లిన విషయం నిజమేనని, అయితే సాయంత్రం అక్కడికి వెళ్లి అరగంట పాటు ఉన్న తర్వాత 6.45 గంటలకు వచ్చేశానని, ఆ విషయం పోలీసులకు తెలియజేయగా… వారు ఒక స్టేట్మెంట్ అడిగినట్లు క్రిష్ జాగర్లమూడి పేర్కొన్నారు.
రాడిసన్ డ్రగ్స్ కేసులో నటి కుషితా కళ్ళపు చెల్లెలు లిషి గణేష్ పేరు కూడా ఉంది. ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. వాటిలో ‘జియోమెట్రీ బాక్స్’ ఒక మోస్తరు గుర్తింపు తెచ్చింది. లిషితో పాటు కుషిత పేరు 2022లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది. మింక్ పబ్ డ్రగ్ కేసులో వాళ్ళిద్దరి పేర్లు వచ్చాయి. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండించారు. చీజ్ బజ్జీలు తినడానికి మాత్రమే తాము హోటల్ దగ్గరకు వెళ్లామని చెప్పుకొచ్చారు. ఆమె సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమెను నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ పేరు రాడిసన్ డ్రగ్స్ కేసులో వినిపించడం చర్చనీయాంశం అయింది. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది.
బలోపేతం కానున్న డ్రగ్స్
యాంటీ నార్కొటిక్స్ విభాగం బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రోనగరం హైదరాబాద్ లో లెక్కకు మిక్కిలి పబ్ లతోపాటు శివారు ప్రాంతాల్లో జరిగే రేవ్ పార్టీల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా యువత వీటికి బానిసలైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే బడిపిల్లలకు సైతం చాక్లెట్ల రూపంలో ఉండే మత్తు పదార్థాలను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు వీటికి బానిసలైపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నగరంలో మత్తు పదార్థాలన్న మాటే వినిపించరాదని గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆ విభాగానికి ఎస్పీని నియమించడంతో మత్తుపదార్థాల అక్రమరవాణాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల మోయినాబాద్ లో ఓ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి నగరంలో పలుకుబడి ఉన్న పెద్దల పిల్లలు చేసిన హంగామా సంచలన రేకెత్తించింది. వారం రోజుల క్రితమే యూట్యూబర్ ఇంట్లోనే మత్తుపదార్థాలు దొరకడం కలకలం రేపాయి.
ఇప్పుడు రాడిసన్ బ్లూ హోటల్లో ఏకంగా ఓ ప్రజాప్రతినిధి కుమారుడే మత్తు పదార్థాలతో పార్టీ ఇవ్వడం చూస్తే హైదరాబాద్ లో చాక్లెట్ల కన్నా ఈజీగా మత్తుపదార్థాలు దొరుకుతున్నాయని అర్థమవుతోంది. ఇక గంజాయి అక్రమ రవాణా సంగతి చెప్పనక్కర్లేదు. సరిహద్దుల్లో ఎంత నాకాబందీ ఏర్పాటు చేసినా..ఏదో రూపంలో గంజాయి నగరంలోకి వస్తూనే ఉంది. వీటన్నింటినీ అరికట్టడానికి యాంటీనార్కోటిక్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మత్తుపదార్థాల సరఫరాలో ఎంతటి వారు ఉన్నా వదిలొద్దని స్పష్టం చేశారు.