లోక్‌సభ ఎన్నికలకు ముందు వరుస షాక్‌లతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఇందులో ఒక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చేయి గుర్తు పార్టీ నుంచి చేజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒకే ఒక రాజ్యసభ ఎన్నికలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదని.. బీజేపీ బరిలో నిలిపిన అభ్యర్థి విజయం సాధించడం పెను సంచలనం రేపింది.హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా ఉన్న సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వానికి మెజారిటీ లేదని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు బాధ్యత వహించి సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రేపు కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారం పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్‌లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశారు. వీరితోపాటు ముగ్గురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్‌కు చెరో 34 ఓట్లు పడ్డాయి. దీంతో వీరి మధ్య టై అయింది. చివరికి డ్రా తీయగా.. అందులో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ విజయం సాధించారు. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమి పాలయ్యారు.ఇక 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకీ కేవలం 25 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఈ 25 మందితోపాటు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్‌కు ఓటు వేయడంతో 34 ఓట్లు వచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ వల వేసి తమవైపు తిప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా పోలింగ్‌కు ముందే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని బీజేపీ నేతలు చెప్పడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.