హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలపై సుఖ్వీందర్ సింగ్ సుఖు క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందని వెల్లడించారు. తాను ఒక యోధుడినని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. “నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాను. నేను రాజీనామా చేయలేదు. నేనో యోధుడిని. ఈ బడ్జెట్ సెషన్‌లో కచ్చితంగా మా బలాన్ని నిరూపించుకుంటాం. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది”
– సుఖ్వీందర్ సింగ్ సుఖు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు హిమాచల్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తున్నారు. డీకే శివ కుమార్‌తో పాటు భూపీందర్ సింగ్ హుడాని పరిశీలకులుగా హైకమాండ్ నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేశారు. ఇదే అక్కడి రాజకీయాల్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. దాదాపు ఏడాది క్రితంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం లేదని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించారని చెబుతోంది బీజేపీ.
ఇక క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన వాళ్లంతా బీజేపీలో చేరుతున్నారన్న వాదనలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే రవి ఠాకూర్‌ని మీడియా ప్రశ్నించింది. ఏ పార్టీలోకి వెళ్తారని అని అడగ్గా..బీజేపీ అని చాలా గట్టిగా సమాధానమిచ్చారు. ఫలితంగా మిగతా ఎమ్మెల్యేలూ ఇదే విధంగా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కాంగ్రెస్‌కి షాక్ తగిలింది. కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీ పోటీ చేయగా..బీజేపీ తరపున హర్ష్ మహాజన్ బరిలోకి దిగి విజయం సాధించారు. ఇద్దరికీ 34 ఓట్లు వచ్చాయి. ఆ తరవాతే కాంగ్రెస్‌కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ అభ్యర్థికి మద్దతునిచ్చారు. అలా హర్ష్ మహాజన్ విజయం సాధించారు.