cm revant
తెలంగాణ రాజకీయం

మాస్టర్ ప్లాన్ 2050….

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది.. ఏయే సంస్థలున్నాయి.. ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు.

బుధవారం సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎం వివరించారు. అలాంటప్పుడు 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కేవలం రూ.7380 కోట్లకు ఐఆర్ బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్‎ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‎ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అవుటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‎గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ది చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని సీఎం సూచించారు.