chandrababu
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చిత్తూరులో చావో, రేవో

చిత్తూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టిడిపి హై కమాండ్‎కు సవాలుగా మారింది. అధినేత సొంత జిల్లా చిత్తూరులో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటికే ప్రకటించిన స్థానాలతో పాటు భవిష్యత్తులో ప్రకటించబోయే నియోజకవర్గాల్లోనూ గందరగోళం నెలకొంది. ఇంకా 7 అసెంబ్లీ సెగ్మెంట్‎లతోపాటు 2 పార్లమెంట్ సీట్లను ప్రకటించాల్సిన టిడిపి హై కమాండ్ పొత్తుల అంశంతో కుస్తీలు పడుతోంది. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేయబోయే కుప్పంతో పాటు పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, నగరి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబు మిగతా చోట్ల ఎవరిని బరిలో దింపాలన్న దానిపై మేధోమధనం చేస్తున్నారు. తిరుపతితోపాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, మదనపల్లి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలే కాకుండా.. తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాలకు బరిలో దింపే అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు. దీంతో పార్టీ ఇన్‎చార్జ్‎లు, ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది.

ఇప్పటికే ప్రకటించిన నగిరిలో టిడిపి ఇన్‎చార్జ్‎ గాలి భాను ప్రకాష్‎కు వ్యతిరేకంగా పార్టీ నేతలు కొందరు అసమతి రాగం వినిపిస్తున్నారు.ఇక చిత్తూరులోనూ ఇదే పరిస్తితి ఉంది. చిత్తూరు టిడిపి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్‎ను ప్రకటించిన హై కమాండ్ నిర్ణయం బలిజ సామాజికవర్గాల్లో అసంతృప్తికి కారణమైంది.ఈ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు ఆ పార్టీ చెక్ పెడితే, బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే చిత్తూరులో టిడిపి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం రోడ్డు ఎక్కింది. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‎కే టికెట్ అన్న ప్రచారం ఎన్నో రోజులుగా ఉంది. శ్రీకాళహస్తి టిడిపి ఇన్‎చార్జ్‎గా బొజ్జల సుధీర్ ఇప్పటికే జనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టగా.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో ఆశావాహులు కొందరు తమకే ఛాన్స్ అన్న ప్రచారాన్ని తెర మీదికి తెస్తున్నారు. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి టికెట్‎పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు ఉండవల్లిలో ప్రయత్నిస్తుంటే, మరోవైపు పొత్తులో భాగంగా జనసేన, బిజెపిలు హడావిడి చేస్తున్నాయి.ఒక అడుగు ముందుకేసిన జనసేన ఇన్‎చార్జ్ వినూత పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి బరిలో ఉంటానని ఏకంగా ప్రచారం చేపట్టింది.

మరోవైపు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ బిజెపి టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. శ్రీకాళహస్తిలోనే కాదు సత్యవేడులోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ హై కమాండ్ టచ్‎లోకి వెళ్లడంతో ఇప్పటికే పార్టీ ఇన్‎చార్జ్‎గా ఉన్న హెలెన్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీని వీడిన ఎమ్మెల్యే ఆదిమూలంకు అవకాశం ఇవ్వాలా లేక టిక్కెట్‎ను ఆశిస్తున్న జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదంటే మరొకరిని బరిలో దింపాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోలేని డైలామాలో పడింది టిడిపి అధిష్టానం. ఇక తిరుపతి విషయం టిడిపికి పెద్ద టాస్క్‎గా మారింది. పొత్తులలో భాగంగా ఏ పార్టీ జెండా తిరుపతిలో ఉండాలో తేల్చకపోతోంది. తిరుపతి టికెట్ టిడిపికా లేక జతకట్టిన జనసేనకా లేదంటే పొత్తుకు సిద్ధమైన కమలం పార్టీకా అన్నది ఆ పార్టీకి కన్ఫ్యూజన్ గా మారింది