దర్శి ఎమ్మెల్యే సోదరుడు దుర్భాషలాడిన ఆడియో సోషల్ మీడియాలోకి రావటమే కారణమా?
కనిగిరి ఏపీసీపీడీసీఎల్ ఇఇ ఎం.భాస్కర్ రావును సస్పెండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు శ్రీధర్ తనను దుర్భాషలాడిన ఆడియోలను సోషల్ మీడియా, ఓ ఛానల్‌లో రావటమే సస్పెన్షన్‌కు కారణమంటూ ఉత్తర్వులలో వెల్లడించారు. సంస్థను అప్రతిష్ట పాలు చేసేలా ఈఈ ఎం.భాస్కరరావు వ్యవహరించారంటూ రాత్రికి రాత్రే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆదేశించారు. ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్ తనను దుర్భాషలాడిన ఆడియోలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కాగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒత్తిడి మేరకే ఇఇ భాస్కరరావును సస్పెండ్ చేసి ఉండవచ్చని శాఖ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాగా నిజాయితీ కలిగిన అధికారిగా భాస్కరరావుకు గుర్తింపు ఉంది.