magunta-tdp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మళ్లీ సొంత గూటికి మాగుంట

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు పొత్తుల అంశం సైతం క్లైమాక్స్ కు చేరుకుంది. దీంతో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై సైతం స్పష్టతనిచ్చారు. కొద్ది రోజుల కిందట ఆయన వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు. జగన్ ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎంపీగా గెలిచారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా మారారు. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ వెన్నంటి నడిచారు. అయితే ఆయన కుమారుడు రాఘవరెడ్డి అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారు. కొద్దిరోజుల పాటు జైలులో ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. ఇదే విషయం జగన్ కు మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పగా… ఆయన సానుకూలంగా స్పందించలేదు.

పైగా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాయబారం నడిపారు. అయినా వర్కౌట్ కాలేదు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును జగన్ ప్రకటించారు. దీంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు నిర్ణయించారు. సరైన వేదిక చూసి టిడిపిలో చేరుతామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. మాగుంట కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఎక్కువకాలం ఆ కుటుంబం ఎంపీగా ప్రాతినిధ్యం వహించింది. 2014 ఎన్నికల తర్వాత మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కానీ గత ఎన్నికలకు ముందు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి టిడిపిలోకి వస్తున్నారు. మాగుంట చేరికతో ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి టిడిపి తరఫున నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు.

జగన్ ప్రభంజనంలో సైతం ఈ జిల్లాలో మెరుగైన ఫలితాలను టిడిపి సాధించింది. ఇప్పుడు మాగుంట చేరికతో దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారని అంచనాలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా రంగంలోకి దించింది. అయితే అది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇష్టం లేదు. ఈ తరుణంలో టిడిపి ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఇక్కడ గట్టి ఫైట్ ఉంటుందన్నది ఒక అంచనా. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వంపై వ్యతిరేకతతో టిడిపికే మొగ్గు కనిపిస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.