దేశవ్యాప్తంగా సోమవారం సాయంత్రం నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు ముస్లిం మత పెద్దలు ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి వారు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులను సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ పాతబస్తీలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పేదలకు దానధర్మాలు చేస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుంది. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందిస్తాయి. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుంది.
లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.’ అని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ధ్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది. ఈ మాసంలో ముస్లింలు తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుకుంటున్నా.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.