లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం దేశంలో పౌరసత్వ సవరణ(సీఏఏ) చట్టం తక్షణం అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు సోమవారం రాత్రి ప్రకటన చేసింది. ఎన్నికల ముందు సీఏఏ చట్టం అమలులోకి తీసుకురావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చట్టానికి పార్లమెంట్‌లో 2019లోనే ఆమోదం లభించింది. అయితే అమలు చేయలేదు. దీనికి ప్రధాన కారణం విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన అందరికీ భారత పౌరసత్వం కల్పించి ముస్లింలకు మాత్రం కల్పించొద్దని ఇందులో పేర్కొనడమే. దీనిపై ఆందోళనలు సైతం జరిగాయిదాదాపు ఐదేళ్లు అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన కేంద్రం.. 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లుల ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ స్పందించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని తమిళనాడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ చట్టం అమలు చేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నవేళ ఇటువంటి వివాదాస్పద చట్టం అమలు చేయడాన్ని తప్పు పట్టాడు దళపతి. ఇదిలా ఉంటే సీఏఏ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడం లేదని తెలిపారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సైతం సీఏఏ అమలును వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని తెలిపారు. ఇక కాంగ్రెస్ కూడా ఈ చట్టం అమలును తప్పు పడుతోంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయసింగ్ అన్నారు. ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి దృష్టి మరల్చడానికే కేంద్రం సీఏఏ అమలు చేయాలని నిర్ణయించిందని ఆరోపించారు. ఐదేళ్లు పెండింగ్‌లో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు.