సీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో విజయంకోసం అనేక అడ్డదారులు తొక్కారన్న విమర్శలు ఉన్నాయి. విపక్షాలు అవి కేవలం విమర్శలు కావు, వాస్తవాలు అంటూ పలు ఉదాహరణలు చూపుతున్నారు. ఇంతకీ జగన్ గత ఎన్నికల్లో అంతలా ఏం చేశారు. ఆయన విజయంలో కీలక భూమిక పోషించిన అంశాలు ఏమిటి ? అన్న ప్రశ్నకు ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వెంటనే గుర్తుకు వచ్చేవి బాబాయ్ హత్య, కోడికొత్తి దాడి. ఈ రెండు ఘటనలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని విజయ తీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి రావడంతోపాటు, భారీ సంఖ్యలో అసెంబ్లీ, ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి ఈ రెండు ఘటనలు ఎంతో దోహదపడ్డాయి. అయితే ఆ రెండు ఘటనలుకూడా జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయన్న విమర్శ:లు అప్పటి నుంచీ ఉన్నాయి.
ఆ విమర్శలు కేవలం విమర్శలు కావు, వాస్తవమే అనిపించేలా ఈ ఐదేళ్లలో ఆ కేసుల విషయంలో జరిగిన పరిణామాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు ఉణ్నాయి. దీంతో జగన్ తాను తీసుకున్న గొయ్యిలో తానే పడబోతున్నాడని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, మరోవైపు కోడికత్తి దాడి ఘటనలు ఎంతో దోహపడ్డాయి. గత ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి హత్యకేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాన్నే సృష్టించింది. అప్పట్లో వివేకాను హత్య వెనుక అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులే ఉన్నారని ప్రజలు నమ్మేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. అయితే, ఇటీవల కాలంలో వివేకా హత్య కేసులో బయటపడుతున్న నిజాలు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. వివేకా హత్య కేసులో జగన్ ప్రోత్సాహం, అవినాశ్ ప్రమేయం ఉందని ఆ కేసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారాడు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం దస్తగిరి సైతం జగన్ మోహన్ రెడ్డికి గట్టి సవాల్ విసురుతున్నాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జై భీమ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు దస్తగిరి ప్రకటించాడు.మరోవైపు కోడికత్తి కేసులో ముద్దాయిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అద్భుత విజయం సాధించటంలో కోడికత్తి శ్రీనివాస్ ది కూడా కీలక భూమిక అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్ ఎలాగైనా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో శ్రీనివాస్ దాడికి ప్రయత్నించాడు. ఈ దాడిలో జగన్ మోహన్ రెడ్డి భుజానికి స్వల్ప గాయమైంది. అప్పట్లో తనపై దాడిచేయించింది చంద్రబాబు, ఆయన మనుషులే అంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకుని ప్రజల సానుభూతి పొందిన జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీను మాత్రం.. జగన్ పై ప్రజల్లో సింపతీ రావాలనే తాను అలా చేశానని చెప్పాడు.
తాజాగా కోడికత్తి శ్రీను.. అసెంబ్లీలో ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలిపిన అభ్యర్థిని ఓడించేందుకు పోటీ చేయబోతున్నాడు. కొడికత్తి శీను కూడా జైభీమ్ భారత్ పార్టీలో చేరి అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయానికి దోహదపడిన ఈ రెండు ఘటనల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులూ కూడా 2024 ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా పోటీలో నిలవనుండడంతో జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పులివెందులలో దస్తగిరి, అమలాపురంలో కోడికత్తి శ్రీను ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతున్నది. ఎన్నికల వేళ వారిద్దరూ నిజాలను ప్రజలకు వెల్లడిస్తే, ఆ రెండు ఘటనల్లో జగన్ ప్రమేయం ఉందని చెబితే వైసీపీని ప్రజలు చీదరించుకుకుంటారన్న ఆందోళన జగన్ లోనూ ఆయన శిబిరంలోనూ వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే జగన్ ఐదేళ్ల అక్రమ, అరాచక పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఓటమి ఖాయమైంది. తాజాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు, కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి ఆ కేసులకు సంబంధించిన నిజాలను బయటపెడితే ఇక వైసీపీకి పడతాయనుకుంటున్న కాసిని ఓట్లు కూడా పడవన్న ఆందోళన వైసీపీ అభ్యర్థులను వెంటాడుతున్నది. ఏపీలో తాజా పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు.. జగన్ తీసిన గొయ్యిలో ఆయనే పడబోతున్నారంటున్నారు