ఓవైపు ఎంపీ అభ్యర్థుల ప్రకటన.. మరోవైపు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎంపిక పక్రియలో అన్ని దశలు దాటిన తర్వాత.. మళ్లీ కొత్తగా అభిప్రాయ సేకరణ చేపట్టడం నేతలకు అంతుచిక్కడం లేదు. ఒక విధంగా అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లు ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ మీటింగ్‌ను నేతలు సీరియస్‌గా తీసుకోవడం లేదని.. మంత్రులు కనీసం కన్నెత్తి చూడలేదనే టాక్ వినిపిస్తోంది.కాంగ్రెస్‌లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పక్రియ టీవీ సీరియల్‌ను తలపిస్తోంది. లిస్ట్ తయారీలో హస్తం పార్టీ పెద్దలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పక్రియను తెలంగాణ కాంగ్రెస్ రెండు నెలల క్రితమే మొదలు పెట్టింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే మొత్తం 309 వచ్చాయి.రెండు మూడు సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను స్క్రూటినీ చేసింది స్ర్కీనింగ్ కమిటీ. డీసీసీలు, నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే అభ్యర్థుల షార్ట్ లీస్ట్‌ను ఏఐసీసీకి పంపింది. ఆ తర్వాతే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల పక్రియపై కసరత్తు చేసి ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇక నేడో, రేపో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పక్రియ మొదలు పెట్టనుండగా.. ఇప్పుడు మళ్లీ అభిప్రాయ సేకరణ అంటూ ఇంచార్జ్ దీపదాస్ మున్షీ కథను మొదటికి తీసుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన నాలుగు స్థానాలకు మినహా మిగతా 13 స్థానాలకు పార్లమెంట్ల వారీగా నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు ఇంచార్జ్ దీపదాస్ మున్షీ. అయితే మిగిలిన 13 స్థానాల్లో కూడా దాదాపు 8 నుంచి 9 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఇప్పటికే క్లారిటీ రాగా.. కేవలం 4, 5 స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో సందిగ్ధత నెలకొంది.మరోవైపు పోటీ ఉన్న స్థానాలపై ఏఐసీసీ ఫ్లాష్ సర్వే చేయించింది. అంటే మిగిలిన అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇక రాష్ట్ర పార్టీ ప్రమేయం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అభిప్రాయ సేకరణ చేయడమేంటనే చర్చ జరుగుతోంది. గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్ అంతా ఉట్టిదే అనే టాక్ హస్తంపార్టీ నేతల్లో వినిపిస్తోంది. కేవలం ఎంపీ స్థానం పరిధిలోని నేతల అభిప్రాయం తీసుకోలేదని ఎవరూ అడగకుండా ఉండడానికే ఈవిధంగా ఉత్తుత్తి మీటింగ్‌లు నిర్వహిస్తున్నారనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది.
మీటింగ్‌కు వచ్చిన నేతలలో ఎక్కువ మంది పార్టీ హైకమాండ్ నిర్ణయానికే వదిలివేస్తున్నామని చెప్పగా.. కొందరు ఎవరో ఒకరి పేరు చెప్పినట్లు సమాచారం. అయితే అటు మున్షీ గానీ.. ఇటు ఏఐసీసీ సెక్రటరీల నుంచి కానీ పోటీలో ఉన్న వారిలో ఎవరికి సపోర్ట్ చేస్తారని అడగలేదని సమాచారం. కేవలం నేతలు చెప్పిన విషయాన్ని రికార్డు చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఏఐసీసీ దృష్టిలో ఎవరి పేరు ఉందో తెలియక ఎవరి పేరు చెబితే ఏం జరుగుతుందో అని కొందరు, ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నాక మన అభిప్రాయం చెప్పడం ఎందుకని మరికొందరు అధిష్టానం నిర్ణయానికే వదిలేసినట్లు సమాచారం. మొత్తానికి అభ్యర్థుల ఎంపిక అయిపోయాక తమ అభిప్రాయంతో పనేముందనే టాక్ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే చాలా మంది నేతలు సమావేశాన్ని లైట్ తీసుకున్నారు. ఇక మంత్రులైతే గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడలేదు.