ARUNCHAL
జాతీయం రాజకీయం

అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో భాగమే..

అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా.. అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా వాషింగ్టన్‌ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ ప్రకటించారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు.అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తున్న చైనా.. తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఇటీవల ప్రధాని మోదీ సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. జాంగ్నాన్   తమదేని, సేలా సొరంగాన్ని భారత్‌ చట్టవిరుద్ధంగా స్థాపించిందంటూ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్‌   గత శుక్రవారం వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చైనా ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నామని అమెరికా తాజాగా వెల్లడించింది