sujana-puran
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సుజనాచౌదరీకి పురందరేశ్వరి దెబ్బ

సుజనా చౌదరి పేరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఆయనకు బిజెపి ఎంపీ టికెట్ ఎందుకు ప్రకటించలేదు? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సుజనా చౌదరి తప్పకుండా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక దశలో ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీ లోకి వెళ్లడంతో.. తప్పకుండా సుజనా చౌదరి బలమైన అభ్యర్థి అవుతారని అంతా భావించారు. ఆయన బిజెపి అభ్యర్థి అయితే చంద్రబాబు సైతం అభ్యంతరం చెప్పరని కూడా అనుకున్నారు. తరువాత గుంటూరు లోక్సభ స్థానం నుంచి సుజనా చౌదరి బరిలో దిగుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇటువంటి తరుణంలో బిజెపి ఎంపీ అభ్యర్థుల జాబితాలో సుజనా చౌదరికి చోటు దక్కకపోవడం విశేషం.సుజనా చౌదరి సీనియర్ నాయకుడు. 2014 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు.ఆ ఎన్నికల్లో పార్టీ సమన్వయంతో పాటు ఆర్థిక వ్యవహారాలు కూడా చూసుకున్నారు.2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.దీంతో సుజనా చౌదరికి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది.

పారిశ్రామికవేత్త, ఆపై కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. రాజ్యసభ సీటును కట్టబెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే టిడిపి ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్ర మంత్రి పదవి కోల్పోయారు. గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో బిజెపిలోకి చేరారు.అయితే గత నాలుగు సంవత్సరాలుగా సుజనా చౌదరి టిడిపి ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని సొంత పార్టీలోనే ఒక విమర్శ ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సుజనాతో పాటు ముగ్గురు రాజ్యసభ సభ్యులు టిడిపి నుంచి బిజెపిలో చేరారు. అందులో సీఎం రమేష్ ఒకరు. ఆయనకు ఈసారి అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. కానీ సుజనా చౌదరి కు మాత్రం ఎక్కడా టికెట్ ప్రకటించలేదు. కనీసం ఆయన పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదు. దీంతో తెర వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది. సుజనా కు టికెట్ రాకుండా అడ్డుకున్నారని టాక్ నడుస్తోంది.టిడిపిలో ఉన్నప్పుడే ఎన్డీఏ ప్రభుత్వంలో సుజనా చౌదరి కేంద్ర మంత్రి అయ్యారు.

అదే ఇప్పుడు ఎంపీగా ఎన్నికైతే కచ్చితంగా కేంద్రమంత్రి అవుతారని అంచనాలు ఉన్నాయి. మరోవైపు పురందేశ్వరి కేంద్రమంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆమె కచ్చితంగా గెలుస్తానని అనుకున్న రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ఎంచుకున్నారు. పొత్తులో భాగంగా సునాయాసంగా ఎంపీ కావచ్చు అని ఆమె భావించారు. అయితే సుజనా చౌదరి ఎంపీ అయితే తనకు అవకాశాలు సన్నగిల్లుతాయని పురందేశ్వరి భావించారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడమే కారణం. అందుకే తెలివిగా పురందేశ్వరి సుజనా చౌదరి తప్పించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయనకు విజయవాడ వెస్ట్ సిటీ ఇస్తారని కూడా తెలుస్తోంది. అంటే కూటమి అధికారంలోకి వస్తే సుజనా చౌదరి మంత్రి అవుతారన్నమాట. అయితే సుజనాకు కేంద్ర మంత్రి అంటేనే ఇష్టం. ఒక పారిశ్రామికవేత్తగా కేంద్రంలో ఉండాలని ఆయన చూస్తారు. కానీ పురందేశ్వరి మంత్రాంగంతో సుజనాకు ఆ అవకాశం లేకుండా పోయింది.