తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా 17 జిల్లాలను ఏర్పాటు చేస్తే సరిపోతుంది అన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.జిల్లాల పునర్విభజనపై అధికారం చేపట్టిన కొత్తలోనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. జిల్లాలను అసంబద్దంగా విభజించారని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పునర్విభజనపై కమిటీ వేసి కొన్ని జిల్లాలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తాజగా ఓ ఆంగ్ల పత్రికలో జిల్లాల పునర్విభజనపై కథనం ప్రచురితమైంది. 18 జిల్లాలను రద్దు చేస్తారని అందులో పేర్కొంది. తెలంగాణలో రద్దు కాబోయే జిల్లాలు పరిశీలిస్తే ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. దీనిపై కాంగ్రెస్ నాయకుడు స్పందించారు.
లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్ సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే కొత్త జిల్లాలు ఏర్పడి 8 ఏళ్లు కావస్తోంది. కొత్త జిల్లాలు కుదురుకుంటున్నాయి. కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయింది. ఈ సమయంలో కుదింపు వార్త తెలంగాణ ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఆలోచనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయంలా ఉందంటున్నారు. తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. జిల్లాలను కుదిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కుదిస్తే జరిగే పరిణామాలు..
– రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్.
– జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్లీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తం.
– విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్‌లన్నీ తిరగరాయాలి
– పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.
– ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగమవుతాయి.
– పార్లమెంటు ఎన్నికల సమయంలో రేవంత్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. ప్రజలు కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వడం ఖాయం.