kejrival
జాతీయం రాజకీయం

లిక్కర్‌స్కామ్‌లో కేజ్రీవాల్‌  కు 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ  

మద్యం పాలసీ కేసు  లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌  కు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ  విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.ఈ కేసులో మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు  ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరుచగా ఢిల్లీ సీఎంకు మరో మూడు రోజులు కస్టడీ విధించింది. కోర్టు విధించి ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ని ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భ‌ద్రత మ‌ధ్య ఆయ‌న్ను కోర్టుకు తీసుకువ‌చ్చారు.స్పెష‌ల్ జ‌డ్జి కావేరి బ‌వేజా ముందు ఆయ‌న్ను ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. ఏప్రిల్‌ 15 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఢిల్లీ సీఎంను తీహార్‌ జైలుకు పంపాలని ఆదేశించింది. కోర్టుకు తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో రిపోర్టర్లు కేజ్రీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది.