ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారుర. భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో వివరాలు వెల్లడించారు. ప్రణీత్ రావు మొదట సహకరించపోయినప్పటికీ తర్వాత వివరాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. హార్డ్ డిస్కులను డిసెంబరు 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పారు. నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ శకలాలు వెలికి తీసారు. ప్రణీత్ రావును మూసీ వద్దకు తీసుకెళ్లి గుర్తించారు. మూసీలో 5 ధ్వసమైన హార్డ్ డిస్క్ కేస్ లు, మెషీన్ తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మూసీలో 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో ఎస్ఐబీ కార్యాలయంలోనూ పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లు స్వాధీనం అయ్యాయి. ఎలక్ట్రిషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగులు స్వాధీనం అయ్యాయి.
ఎస్ఐబీ కార్యాలయం సీసీ ఫుటేజి లాగ్ బుక్ ప్రతులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసారు. భారాసేతర అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు ఎస్ఐబీ కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చాడు. భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు, తిరుపతన్న కుట్ర ఉన్నట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు.