ycp-tdp-gannavaram
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

గన్నవరం…ఎవరికి వరం

గన్నవరం.. ఈ పేరు చెబితేనే అధికార, ప్రతిపక్షాల్లో హైఅలర్ట్‌ కనిపిస్తుంది. గన్నవరంలో గెలుపు ఇరు పార్టీలకు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఐదేళ్లుగా నిత్యం ఏదో వివాదంతో.. అనునిత్యం వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గమూ గన్నవరమే. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన వారే.. మరోసారి కాలుదువ్వుతున్నారు.ఐతే పాత ప్రత్యర్థులు ఇప్పుడు పార్టీలు మారారు. అటు వారు ఇటు.. ఇటు వారు అటు వైపు నుంచి తలపడుతున్నారు. ఇద్దరి బ్యాక్‌గ్రౌండూ పెద్దదే.. అంగ, అర్ధబలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని పరిస్థితి. మరి ఈ సమ ఉజ్జీల సమరంలో గెలిచేది ఎవరు? గన్నవరం ఏ పార్టీకి వరంగా మారబోతోంది రాష్ట్ర రాజకీయాలకు రాజధాని విజయవాడ.. ఈ నగరానికి అనుకుని ఉండే నియోజకవర్గం గన్నవరం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న గన్నవరం పేరు చెబితేతెలియని వారు ఉండరు. విద్య, వాణిజ్య పరంగానే కాదు.. రాజకీయంగానూ గన్నవరం నియోజకవర్గానికి పెద్ద చరిత్రే. గతంలో ఎందరో హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఈసారి హోరాహోరీ పోటీకి వేదికైంది.

ఇద్దరు సమ ఉజ్జీల సమరానికి తెరలేచింది. అంగ, అర్ధ బలాలే కాదు.. వ్యూహా, ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో గన్నవరం రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఈ సారి వెలువడే తీర్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌, టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌ పోటీచేస్తున్నారు. ఈ ఇద్దరూ గత ఎన్నికల్లోనూ ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. ఐతే ఆ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేశారో.. ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అంటే అటు వారు ఇటు.. ఇటు వారు అటు మారిపోవడంతో మొత్తం రాజకీయ సమీకరణాలే మరాపోయాయి. గత ఎన్నికల్లో కేవలం 800 ఓట్ల తేడాతో గెలిచిన వంశీ, ఈ సారి అధికార పార్టీ అండతో మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన వంశీమోహన్‌ మూడోసారి గెలిచి హాట్రిక్‌ సాధిస్తానని చెబుతున్నారు.తన ప్రత్యర్థులు ఎవరైనా గెలిచేది తానేనంటున్న వంశీ.. వైసీపీలో పూర్తిస్థాయి పట్టు సాధించారు.

పార్టీలో తనను వ్యతిరేకించిన వారంతా పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే వంశీమోహన్‌కి తలనొప్పులు తొలగిపోయాయి. దీంతో క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వంశీమోహన్‌.గన్నవరం నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు అత్యధికంగా ఉంటారు. దీన్ని గమనించే తొలుత బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని చూసింది టీడీపీ. బీసీ నేతలైన బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని గన్నవరం నుంచి నిలపాలని భావించింది. ఐతే అనుకోకుండా ఎమ్మెల్సీ అర్జునుడు మరణించడం, పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారథికి నూజివీడు టికెట్‌ కేటాయించింది. ఈ పరిణామాలతో వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం స్థానాన్ని కేటాయించారు. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం, స్థానికంగా అందరికి అందుబాటులో ఉండటం, సేవా కార్యక్రమాలు వంటి అనుకూల అంశాలన్నీ యార్లగడ్డకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది టీడీపీ. ఇక గత ఎన్నికల్లో స్పల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ ఈ సారి తనదే విజయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు.

నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నా…. అధికార, ప్రతిపక్షాలు రెండూ అగ్రవర్ణాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు ఇచ్చాయి. ఈ ఇద్దరూ పాత ప్రత్యర్థులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఇద్దరి సామాజిక, ఆర్థిక నేపథ్యం, దూకుడు స్వభావంతో గన్నవరం రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. ఓ విధంగా ఇద్దరు నేతలకు ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి.గన్నవరం ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాన్ని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడాయే ఉండటంతో ఈ సారి ఫలితం ఉత్కంఠ పెంచేస్తోంది. రెండు పార్టీల అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో నిత్యం జనంలోనే కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. చేతికి ఎముకే లేనట్లు ఖర్చు చేస్తున్నారు. జనం కూడా ఇద్దరి వెంట భారీగానే కనిపిస్తుండటంతో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.