కడప జిల్లాలో జగన్, అవినాష్ రెడ్డి టార్గెట్‌గానే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల బస్ యాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. వైఎస్‌ఆర్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉండేవాళ్లను గుర్తుచేశారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బస్ యాత్రలో షర్మిల ఇంకా ఏమన్నారంటే…”బీజేపీకి వైఎస్సార్ ఎప్పుడు వ్యతిరేకే. మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ. వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసగా ఉన్నారు. అందుకే ముస్లీంలకు జగన్ సమాధానం చెప్పాలి. మణిపూర్‌లో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదు.- బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు. జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశారు. ఇమామ్‌లకు 15 వేలు వేతనం అన్నారు. ముస్లీం బ్యాంక్ అన్నారు. చనిపోతే 5 లక్షల బీమా అన్నారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మరిచారు.” అలాంటి వ్యక్తికి ఇప్పుడు బుద్ది చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు.
ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు షర్మిల. బాబు, జగన్ ఇద్దరు ముస్లీంల పక్షాన లేరని తేల్చేసారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని వీళ్ళు బానిసలు అయ్యారని ప్రశ్నించారు. “విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదు. హోదాపై బీజేపీ మోసం చేసింది., వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేది.కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారు. మూడు సార్లు శంకుస్థాపన చేశారు. ఎంపిలు నిద్ర పోతున్నారు. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదు. కడప – బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం. కడప లైన్‌ను జగన్ వద్దన్నారట.” అని విమర్శించారు. నిందితుడిగా అవినాష్ రెడ్డి మీద సీబీఐ ముద్ర వేసిందన్న షర్మిల… నిందితుడిగా ఉన్న వ్యక్తికి మళ్ళీ ఎలా టిక్కెట్ ఇచ్చారని జగన్‌ను ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
“బాబాయి హత్య కేసులో జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు. ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారు? CBI విచారణ ఎందుకు వద్దన్నారు? మీరు నేరం చేయక పోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు ? నిందితులను ఎందుకు కాపాడుతున్నారు?” వీటికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలని కడప జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నిందితుడు అని సీబీఐ చెప్తున్న అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతోనే తాను పోటీలోకి దిగాల్సి వచ్చిందన్నారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానన్న షర్మిల… వైఎస్సార్ లెక్క సేవ చేస్తాని హామీ ఇచ్చారు.