ap govt. schools
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మారిపోయిన స్కూళ్లు…

అందమైన భవనాలు, ఆకర్షణీయమైన క్లాసురూములు.. డిజిటల్ బోర్డులు.. సౌండ్ బాక్సులు.. విద్యార్థులు కుర్చోడానికి బెంచీలు.. ఇవన్నీ ఉన్నాయంటే అదేదో కార్పొరేట్ పాఠశాలలు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటుపడినట్లే. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలివి. నాడు-నేడుతో కార్పొరేట్ స్కూళ్లను మైమరించేలా తయారయ్యాయి ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలలు అంటే శిథిల భవనాలు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర స్థితులే ఉండేవి. వర్షాకాలం వచ్చిందేంటే వరుస సెలవులే. కారుతున్న భవనాల్లో చదువు చెప్పలేక, చెరువులను తలపించే పాఠశాల ప్రాంగణంలో అడుగు పెట్టలేక ఉపాధ్యాయులే సెలవులు ప్రకటించేవారు. ఏపి ప్రభుత్వం మన బడి – నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలనే మార్చేసింది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతితో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ పాఠశాల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీట్లు అన్నీ ఫిలప్ అయి.. నో సీట్స్ బోర్డు కొన్ని పాఠశాలల్లో పెట్టిన సంఘటనలు చూస్తున్నాం ఇప్పుడు.మన బడి – నాడు నేడు పథకం కింద గత ఐదేళ్లలో పాఠశాలల అభివృద్ధికి 12 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించింది సీఎం జగన్ ప్రభుత్వం.

2019 నవంబరు 14న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 44 వేల 512 పాఠశాలల రూపురేఖలను మార్చడమే ఈ పథకం అసలు ఉద్దేశం. వీటిలో కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమశాఖలు, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్లు మన బడి – నాడు నేడు పథకాన్ని పర్యవేక్షించాయి. ఫేజ్-1లో 15 వేల 715 పాఠశాలల్లో ఈ పథకం అమలు చేశారు. ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి.2019 నుంచి మూడేళ్ల వ్యవధిలో దశలవారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రస్తుత మౌలిక సదుపాయాలను మిషన్ మోడ్‌లో మార్చడమే నాడు-నేడు పథకం ప్రధాన ఉద్దేశ్యం. మన బడి – నాడు నేడు కార్యక్రమం కింది 9 మౌలిక సదుపాయాలను చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. డిజిటల్ బోర్డులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లీషు ల్యాబ్, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, నీటి సౌకర్యంతో మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. దీనితో రాష్ట్రంలోని పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

సర్వ హంగులతో కార్పొరేట్ పాఠశాలల లుక్ వచ్చేసిందని చెప్పవచ్చు.చదువు పట్ల విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించేందుకోసం, అవగాహన కల్పించేందు కోసం బైజూస్ ట్యాబ్లను అందజేయడంతో విద్యార్థుల్లో బడికి వెళ్లాలన్న ఆసక్తి పెరిగింది. ఇంట్లో కూడా ట్యాబ్ చూస్తూ చదువుకుంటున్నామని, అర్థం కాకుంటే మళ్లీ మళ్లీ చూస్తూ తెలుసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి తోడు స్కూల్ యూనిఫాం, బూట్లు, స్కూల్ బ్యాగ్, ఉచితంగా పుస్తకాల పంపిణీ, అమ్మ ఒడి పథకంతో చదువుల భారం తల్లిదండ్రులకు తగ్గిపోయింది. దీనితో డ్రాప్ అవుట్స్ సంఖ్య పూర్తిగా తగ్గింది.మన బడి – నాడు నేడు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చదువు “కొనే” రోజులు పోయి.. “చదువుకునే రోజులు” వచ్చాయి. ఈ పథకం పూర్తిగా అమలైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుందని చెప్పాల్సిందే.