sharmila
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

షర్మిళ దూకుడుకి కారణం ఎవరు

షర్మిల అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆమె వెనుక్కున్నది ఎవరు? చంద్రబాబా? కాంగ్రెస్ హై కమాండ్ ఉందా? సొంత అన్నపై ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఇలా రకరకాల చర్చ కొనసాగుతోంది. ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ సోదరి కావడంతోనే ఏం చేయలేరన్న ధీమానా? మరో కారణం ఉందా? అసలు షర్మిల వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు అందరి నోట ఇదే వినిపిస్తోంది. బలమైన చర్చ నడుస్తోంది. జగన్ ను రాజకీయ ప్రత్యర్థులు కూడా అనలేని మాటలను షర్మిల అనగలుగుతున్నారు. బలమైన ఆరోపణలు చేయగలుగుతున్నారు.షర్మిల వెనుక ఉండి చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారని తరచు వైసిపి నేతలు ఆరోపిస్తుంటారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం, ఏపీ రాజకీయాల వైపు రావడం, పీసీసీ పగ్గాలు అందుకోవడం వెనుక చంద్రబాబు వ్యూహాలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం షర్మిల రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు. కడప జిల్లా నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా బాబాయ్ హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్ పై విరుచుకుపడుతున్నారు. అవినాష్ వెనుక జగన్ ఉన్నారని ఆరోపిస్తున్నారు.

ఏకంగా కడప నడిబొడ్డులోనే సౌండ్ చేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో విపక్ష నేతలే కడపలో విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేస్తారు. అటువంటిది షర్మిల నిర్భయంగా ఆరోపణలు చేస్తుండడం మాత్రం సాహసమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె వెనుక బలమైన శక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అది చంద్రబాబుకు మించి ఉండొచ్చు అని భావిస్తున్నారు.వాస్తవానికి సొంత పార్టీతో ఫెయిల్ అయిన తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని భావించారు. కనీసం ఆమె ఏపీ వైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ ఉన్నట్టుండి పరిస్థితి మారింది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఎంటరయ్యారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల భావించారు. అందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదు. దీంతో షర్మిల తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీకి రావాల్సి వచ్చిందని టాక్ నడిచింది. కానీ షర్మిల ఏపీ వైపు రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అని తెలుస్తోంది. కష్టకాలంలో ఉండగా తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న రేవంత్ దూకుడుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి నిలపగలిగారు.

పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. రేవంత్ రెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకునే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏపీకి సంబంధించి రాజకీయ నేతల మూలాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో ఏపీలోని ప్రతి రాజకీయ నేతల ఆస్తులు, వ్యాపారాలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో నేతలు తగ్గి వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో వైసిపి నేతలు అతీతులు కాదు. అందుకే వారి దూకుడుకు కళ్లెం వేసి షర్మిల ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో పరిస్థితులను చూసి ఇక్కడ షర్మిల స్వేచ్ఛగా రాజకీయాలు చేయగలుగుతున్నారు.

వైసిపి తో పాటు జగన్ పై షర్మిల బలమైన ఆరోపణలు చేస్తుండగా.. ఆ స్థాయిలో షర్మిలపై వైసీపీ నేతలు విరుచుకు పడడం లేదు. ఒకటి తెలంగాణలో ఆస్తులు తో పాటు వ్యాపారాలు.. మరోవైపు షర్మిల వైయస్ బిడ్డ కావడంతో వైసిపి నేతలకు ఎటూ పాలు పోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే షర్మిల దూకుడు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని స్పష్టమైంది. రేవంత్ మాదిరిగా దూకుడుగా వ్యవహరించి ఏపీకి భావి నాయకురాలిగా అవతరించాలని షర్మిల భావిస్తున్నారు. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
రంగంలోకి ఐప్యాక్
ఇప్పుడు ఐప్యాక్ ఏపీలో అన్ని పార్టీలకు పని చేస్తోంది. మీరు చదివింది నిజమే. వైసిపి తో పాటు ప్రత్యర్థి పార్టీలకు సైతం ఐప్యాక్ సేవలందిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను పలుచన చేసేందుకు ఆ టీం చేయని ప్రయత్నాలు లేవు. లోకేష్ పాదయాత్ర సమయంలో అయితే వందలాది మంది రంగంలోకి దిగారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కనికట్టు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని లోకేష్ పాదయాత్రను పూర్తి చేయగలిగారు. అయితే ఇప్పుడు ఐప్యాక్ టీం షర్మిల కోసం పనిచేస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. అధికార పార్టీతో పాటు అన్న పై విరుచుకుపడుతున్నారు. దీంతో ఎలాగోలా షర్మిలను అడ్డుకోవాలని ఐ బ్యాక్ టీం రంగంలోకి దిగింది. పలుచన చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఎడిటింగ్ చేసిన ఆ వీడియో ఇట్టే దొరికిపోతోంది.పాదయాత్ర కడపలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను షర్మిల ఫ్యాన్ అంటూ ఒక యువకుడు మైక్ తీసుకున్నాడు.

సాక్షి స్క్రిప్ట్ యధావిధిగా చదివేశాడు. 2011 నుంచి జగన్ ప్రజల కోసం పనిచేస్తున్నారని.. ఆయన చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారని… జగన్ చెప్పిన దాన్ని చేసి తీరుతాడని భారీ డైలాగ్ కొట్టాడు. మీ కుటుంబ సమస్యలను తెచ్చి రాజకీయాలు చేయకండి అంటూ షర్మిలకు సలహా ఇచ్చాడు. ఆ కుర్రాడి మాట తీరు చూస్తుంటే కచ్చితంగా ప్రామిటింగ్ కనిపిస్తోంది. అయినా ఆగ్రహానికి లోను కాకుండా షర్మిల సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. నేను నువ్వు అభిమానించే నేత కోసం 3200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని.. అలాంటి సొంత చెల్లి బతుకుకునే రోడ్డున పడేశాడంటూ షర్మిల మాట్లాడడంతో ఆ యువకుడి నోటి మాట రాలేదు. అయితే ఐపాక్ టీం ఇక్కడే తన తెలివితేటలను ప్రదర్శించింది. ఆ యువకుడి మాటలనే హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.అయితే ఐప్యాక్ టీమ్ కు ఈ తరహా ప్రయత్నాలు కొత్త కాదు. గత ఎన్నికలకు ముందు నుంచి వైసీపీతో పాటు జగన్ తరుపున ఈ టీం పని చేస్తోంది. ప్రజల్లో వర్గ విభేదాలను సృష్టించడం ఈ టీంకు అలవాటైన విద్య.

ముఖ్యంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎటువంటి ప్రచారాన్నైనా రక్తి కట్టించగల నేర్పరి. దీనికి వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎలాగూ తోడు ఉంటుంది. సజ్జల భార్గవ్ నేతృత్వంలోని ఈ టీం కూడా చక్కగా పనిచేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి షర్మిల నుంచి భారీ డ్యామేజ్ జరుగుతోంది. అందుకే అటు ఐ ప్యాక్ టీం తో పాటు ఇటు సజ్జల భార్గవ్ నేతృత్వంలోని సోషల్ మీడియా టీం పూర్తిగా షర్మిలపైనే దృష్టి పెట్టింది. కానీ ఇటువంటి ప్రయత్నాలను షర్మిల లైట్ తీసుకుంటున్నారు. కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు.