మహారాష్ట్రలో బీజేపీ, ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యానించారు. శనివారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయిన నేపథ్యంలో రామ్‌దాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పవార్ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కలుపాలని కోరారు.
ప్రధాని మోదీ, శరద్‌పవార్ భేటీ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. దాంతో ఈ ఊహాగానాలపై ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, ఎన్సీపీ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన, రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయని, అలాంటి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై కూడా అథవాలే స్పందించారు.
ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా రాజకీయపరమైన, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని, అయినా ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. అలాంటప్పుడు బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేవని ప్రశ్నించారు. అంతేగాక మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్ ఈ మధ్య తరచూ శరద్‌పవార్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
అందుకే శరద్‌పవార్ తప్పకుండా కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో చేతులు కలుపుతారని భావిస్తున్నానని రామ్‌దాస్ అథవాలే చెప్పారు. అంతేగాక గత ఏడాదికిపైగా కాంగ్రెస్ పార్టీ శివసేనకే ఎక్కువ సపోర్టు చేస్తున్నదని, ఎన్సీపీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నదని వ్యాఖ్యానించారు. అందుకోసమైనా శరద్‌పవార్ కూటమిని వీడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అథవాలే సూచన చేశారు.