congress
తెలంగాణ రాజకీయం

మూడు సీట్లపై తుది నిర్ణయం

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే సతమతమవుతోంది. ఇప్పటికే 14 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇంకో మూడు స్థానాలను పెండింగ్‎లో పెట్టింది. మూడు స్థానాల్లో హైదరాబాద్ స్థానంలో అభ్యర్థిని ప్రకటించడానికి పెద్ద ఇబ్బంది లేకపోయినా మిగతా రెండు స్థానాలపై కాంగ్రెస్ హై కమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఖమ్మం, కరీంనగర్ సెగ్మెంట్లలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనే విషయంలో హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. హైదరాబాద్ నుండి మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అలీ మస్కటి పేరును పరిశీలిస్తోంది. బీజేపీ తరపున మహిళ నేత బరిలో ఉన్న కారణంగా మైనార్టీ మహిళ నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. సుప్రీం కోర్టు అడ్వకేట్ తుబ్సుం పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఇక హైదారాబాద్ నుండి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను బరిలో దింపితే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తోంది.

సానియా మీర్జాను పోటీకి ఒప్పిస్తే అసదుద్దీన్ ఒవైసీని హైదరాబాద్‎కే పరిమితం చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలు కాకముందే కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు ఒక హాట్ టాపిక్‎గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటు మినహా మిగతా అన్ని అసెంబ్లీలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరు బరిలో ఉన్నా గెలుపు కాంగ్రెస్‎కే అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్‎కి అక్కడ ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం ఇటీవలే కాంగ్రెస్ గూటికి వచ్చిన నేపథ్యంలో ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా మారింది. ఇక అక్కడ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ కేటాయించాల్సిందిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి హై కమాండ్‎కి విన్నవించినట్టు తెలుస్తోంది. ఇక మరో మంత్రి తుమ్మల సైతం తమ కుమారుడు యుగేందర్‎కి ఖమ్మం సీటు ఇవ్వమని కోరారు. సీనియర్ నేత వీహెచ్, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సైతం ఖమ్మం టికెట్ కోసం అధిష్ఠానాన్ని కలిశారు.

అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఖమ్మం టికెట్ కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందనే చర్చ నడుస్తోంది. దానిలో భాగంగా నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఇక పొంగులేటి వియ్యంకుడు రఘురామి రెడ్డి పేరు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఆరు టికెట్లు ఇవ్వడంతో ఖమ్మం స్థానాన్ని కమ్మ లేదా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.కరీంనగర్ పార్లమెంట్ విషయంలో సైతం కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కరీంనగర్ నుండి పోటీ చేయాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్ఠానం కోరగా జీవన్ రెడ్డి మాత్రం తాను నిజామాబాద్ నుండి పోటీ చేస్తానని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్‎లో పడింది. ఇక ఆ స్థానం నుండి పోటీ కోసం ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రెడ్లకి ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చామని, కరీంనగర్‎లో వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది.

ఇక ఆ పార్లమెంట్ పరిధిలోని మంత్రులు సైతం టికెట్ ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పడంతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం సీఈసీ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. అంత కంటే ముందు హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు రేవంత్. ఆ తరువాత సీఈసీ మీటింగ్‎లో పెండింగ్‎లో ఉన్న మూడు స్థానాలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ మూడు స్థానాలు ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల సర్దుబాటులో ఎవరికి టికెట్ గల్లంతు అవుతుంది. ఎవరు గట్టెక్కుతారో వేచి చూడాలి.