తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు నుండి 2 రోజులు తెలంగాణ రాష్టంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత్తలు క్రమేణా 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది.
నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.1 డిగ్రీలుగా నమోదైంది. 39 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. రాయలసీమ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చు.దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.