“ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి.. గత ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉంటేనే పార్టీ పరిస్థితి చాలా దారుణంగా మారింది. కీలకమైన నేతలు కండువాలు మార్చారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఈ క్రమంలో కేడర్ ను కాపాడుకోవాలంటే.. అధికారంలోకి రావాల్సిందే. లేకుంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరమవుతుంది.” గత ఏడాది ఇదే సమయానికి హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో టిడిపి నాయకులు నిర్వహించిన సమీక్షలో వ్యక్తం చేసిన అభిప్రాయం. పార్టీని సామాజిక మాధ్యమాలలో విస్తృతం చేయాలని అప్పట్లో నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ డిజిటల్ విభాగాలను ఈ ఎన్నికల వరకు బలోపేతం చేసినట్టు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్నికల్లో అధికార వైసిపికి అనుకూలంగా ఐప్యాక్ పనిచేస్తుండగా.. టిడిపికి రాబిన్ సింగ్ సేవలు అందిస్తున్నారు. అతడి సేవలు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ, ఇతర అనుబంధ సంఘాల నాయకులు వారి దిశలో వారు పనిచేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా డిజిటల్ డ్రైవ్ నిర్వహిస్తోంది..
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 1.5 లక్షల వాట్స్అప్ గ్రూప్ లు క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టుగానే మీమ్స్ పేజీలు రూపొందించింది. నాలుగు టిడిపి అనుకూల చానల్స్ లో ప్రసారమయ్యే వార్తల కంటెంట్ కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లలో సర్కులేట్ చేస్తోంది. మీమ్స్ గ్రూపులలోనూ అకౌంటెంట్ వాడుకుంటున్నది. ఓ టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీకి 1,48,313 క్రియాశీల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ గ్రూపులు ఇందుకు అదనం. సుమారు 500 పేజీలు టిడిపి కోసం పనిచేస్తున్నాయి. ఇక “మన టిడిపి” యాప్ లో ఏకంగా 2.5 లక్షల మంది యూజర్లు ఉన్నారు. పార్టీ చేసిన సూచనల ప్రకారం ఇందులో కంటెంట్ రూపొందిస్తారు. టిడిపిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే ఎలాంటి పనులు చేయాలో నిర్దేశిస్తారు. దాని ప్రకారం ఇక్కడ కంటెంట్.. ఇతర వీడియోలు.. మీమ్స్ తయారవుతాయి.
వైసీపీకి వ్యతిరేకంగా, చంద్రబాబు, లోకేష్ కు అనుకూలంగా ఇక్కడ కంటెంట్ రూపొందిస్తారు. పాత్రికేయులు, ప్రభావశీల వ్యక్తులు ఇందులో పనిచేస్తుంటారు. ఇక మీమ్స్, ట్రోల్స్ ను రూపొందించే బృందం వేరే ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కథనాలను జోరుగా రూపొందిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన అవకతవకలను, ప్రభుత్వ విధానాలను భూతద్దంలో చూపించి మరి ప్రజల ముందు మరో కోణాన్ని ప్రదర్శిస్తున్నారు.“ఐ టీడీపీ” విభాగంలో డిజిటల్ వలంటీర్లు ఉంటారు. వీరు అప్లికేషన్ టీం గా ఏర్పడి వలంటీర్లను నియమించుకున్నారు. వారు పార్టీ అభివృద్ధి కోసం ఒక క్యాలెండర్ నియమించుకొని దానికి తగ్గట్టుగా పనిచేస్తుంటారు. ఇందులో కీలకంగా పనిచేసిన వారికి ప్రత్యేక ప్రశంసలు లభిస్తాయి. అలా ప్రశంసలు అందుకున్న వారికి చంద్రబాబు, లోకేష్ నుంచి అభినందనలు దక్కుతాయి. పార్టీ పదవుల్లో సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. ఇక “ఐ టిడిపి” విభాగం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేపట్టిన వ్యతిరేక కార్యక్రమాలు ఇటీవల విజయవంతమయ్యాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అంతేకాదు “ఐ టిడిపి” విభాగం చేస్తున్న డిజిటల్ డ్రైవ్ లో జగన్ వ్యతిరేక ప్రచారం మాత్రమే కాకుండా.. 2014 నుంచి 2019 వరకు టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు.. అభివృద్ధిపై కూడా పాజిటివ్ కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల ఏపీలో పింఛన్ల పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐటీడీపీ కొన్ని వందల కొద్ది కథనాలను ప్రసారం చేసింది. వందల కొద్ది వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అనుబంధ గ్రూపుల్లో ట్రోల్స్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జగన్మోహన్ రెడ్డి కి ఐ ప్యాక్ పనిచేస్తున్న నేపథ్యంలో.. టిడిపికి “ఐ టిడిపి”విశేషమైన సేవలు అందిస్తోంది. అయితే ఇవన్నీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయా? లేదా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.