nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ప్రచారంలో కనిపించని లోకేష్

నారా లోకేష్ పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. కూటమి తరుపున చంద్రబాబుతో పాటు పవన్ ప్రచారం చేస్తున్నారు. మధ్యలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో పురందేశ్వరి హాజరవుతున్నారు. కానీ లోకేష్ మాత్రం హాజరు కావడం లేదు. దీని వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లోకేష్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటే.. ఆయనను ప్రమోట్ చేసేందుకే చంద్రబాబు ప్రయోగిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపించే అవకాశం ఉంది. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ముందు.. ఓ టీవీ ఇంటర్వ్యూలో లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని తేల్చారు. ఇది పెద్ద దుమారానికి దారితీసింది. కాపు సామాజిక వర్గంలో ప్రభావం చూపింది. లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నం జరిగింది. అటువంటి పరిస్థితి తలెత్తకూడదని చంద్రబాబు భావించారు. అందుకే లోకేష్ ను మంగళగిరి కి పరిమితం చేశారన్న ప్రచారం జరుగుతోంది.గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేశారు. మంత్రిగా ఉంటూ మంగళగిరిని ఎంచుకున్నారు.

అసలు టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఆ నియోజకవర్గంలో గెలిచింది చాలా తక్కువ. అటువంటి రిస్క్ నియోజకవర్గాన్ని ఎంచుకున్న లోకేష్ మూల్యం చెల్లించుకున్నారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలని భావించారు. గత ఐదేళ్లుగా మంగళగిరిని సొంత నియోజకవర్గంగా భావించి పర్యటనలు చేస్తున్నారు. అయితే లోకేష్ ను మరోసారి మంగళగిరిలో ఓడించాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే జగన్ కు ఛాన్స్ ఇవ్వకూడదని లోకేష్ భావిస్తున్నారు. మంగళగిరిలో గెలిచి జగన్ కు సవాల్ విసిరాలని చూస్తున్నారు.అయితే లోకేష్ మంగళగిరి పై పట్టు సాధిస్తూనే.. రాష్ట్రస్థాయిలో పార్టీని సమన్వయ పరుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 141 అసెంబ్లీ సీట్లలో టిడిపి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 31 సీట్లు కోల్పోవడంతో.. చాలామంది నేతలుత్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎక్కడికక్కడే అసంతృప్తులు బయటపడుతున్నాయి. చాలామంది ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో లోకేష్ విజయవాడ కేంద్రంగా ప్రత్యేక బృందాలను నియమించారు. వారు అసంతృప్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.

లోకేష్ తో మాట్లాడిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ తరఫున ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయం చేస్తున్నారు. అటు మంగళగిరి నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూనే.. ఎన్నికల వ్యూహాల్లో లోకేష్ తలమునకలై ఉన్నారు. అందుకే లోకేష్ ఎక్కడ బయటకు కనిపించడం లేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే లోకేష్ తో ఇబ్బందులు వస్తాయని తెలిసి చంద్రబాబు ప్రచార సభలకు తీసుకెళ్లడం లేదని మాత్రం తెలుస్తోంది