జగన్ చేసింది చెబుతారు.. చెప్పింది చేస్తారు’… తమ అధినేత గురించి వైసిపి నేతలు చెప్పుకునే మాట ఇది. కానీ గత ఎన్నికల్లో ప్రజలకు చాలా హామీలు ఇచ్చారని.. వాటిని అమలు చేయలేకపోయారని ఒప్పు కునేందుకు మాత్రం ఇష్టపడరు. పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. అందుకే తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం మధ్య నిషేధం చేస్తామని జగన్ విపక్షనేతగా హామీ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లుగా మద్య నిషేధం మాట అటు ఉంచితే.. చిత్ర విచిత్రమైన మద్యం పాలసీలను ప్రవేశపెట్టి.. మద్యం ధరను పెంచి.. నాసిరకం బ్రాండ్లు అమ్మించి.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడి..
ప్రజల విలువైన ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఆ మద్య నిషేధం మాటనే మరిచి పోయారు. ఎన్నికల్లో కూడా అదే రకమైన హామీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సారీ చెప్పారు. ఇప్పటికిప్పుడు మద్య నిషేధం అమలు చేయలేనని చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. ఏటా 25 శాతం షాపులను తగ్గించి.. నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తానని ప్రకటించారు. నాసిరకం మద్యంతోపాటు ధరలను పెంచితే మందు బాబులు అటువైపు రావడం మానేస్తారని ఏవేవో కల్లబొల్లి మాటలు చెప్పారు. కానీ ఏటా 25 శాతం షాపుల తగ్గింపు మాటను పక్కన పెట్టారు. పర్యాటకం మాటున బార్లు ఏర్పాటు చేశారు. మరిన్ని అవుట్లెట్ దుకాణాలను నెలకొల్పారు. పచ్చి పచ్చిగా చెప్పాలంటే.. ప్రతి గ్రామానికి మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.వైసిపి మద్యం పాలసీ ఆ పార్టీ నేతలకు కాసులు కురిపించింది. అప్పటి వరకు ఉన్న ప్రైవేటు మద్యం పాలసీని జగన్ రద్దు చేశారు. ప్రభుత్వమే నేరుగా దుకాణాలను నడిపేందుకు నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు.
ఆ బ్రాండ్లన్నీ వైసిపి బడానేతలవి కాగా.. షాపుల నిర్వహణ, వాటికి అద్దె నిర్ణయం, సిబ్బంది నియామకం వంటి వాటితో మరికొందరు చోటా నేతలు లబ్ది పొందారు. ఇక దొంగ సారా, మద్యం తయారుచేసి కింది స్థాయి నేతలు బాగుపడ్డారు. బాగుపడని వారి జాబితాలో ప్రజలే ఉన్నారు. అత్యధిక ధర చెల్లించి, నాసిరకం మద్యం తాగి, ఎన్ని రకాల రుగ్మతలు తెచ్చుకోవాలో.. అన్నీ తెచ్చుకున్నారు. వేలాదిమంది నకిలీ మద్యం తాగి చని పోయారు. కానీ అవన్నీ అనారోగ్య జాబితాలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అదే జగన్ మరోసారి ఓట్లు అడగడానికి ప్రజల మధ్యకు వస్తున్నారు. మద్య నిషేధం గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ప్రజలకు పంచడం ద్వారా రాజకీయాలు చేస్తున్న ఆయన.. తాను ఒక హామీ ఇచ్చాను అన్న విషయం పూర్తిగా మరిచిపోయారు.