telan-congr
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ లో కనిపించని సోషల్ ఇంజనీరింగ్

తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక అనేక సామాజికవర్గాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. రిజర్వుడు సీట్లలోనూ సరైన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక జనరల్ కేటగిరిలో రెడ్డి వర్గానికి దక్కినంత ప్రాధాన్యం ఇతర వర్గాలకు దక్కలేదు. ఫలితంగా దాదాపుగా అన్ని  వర్గాల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. మాదిగలకూ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. మోత్కుపల్లి నరసింహులు దీక్షకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు ఎస్సీ రిజర్వుడు, రెండు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. మిగతా పన్నెండు జనరల్ నియోజకవర్గాలు. ఇప్పటి వరకూ జనరల్ నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, భువననగిరి నుంచి సామ కిరణ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డికి టిక్కెట్లు ప్రకటించారు.

ఇంకా  మూడు స్థానాలు పెండిగ్ లో ఉన్నాయి. అంటే పన్నెండు స్థానాల్లో మూడు మాత్రమే ఇతురలకు ఇచ్చి ఆరింటిలో రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులను పెట్టారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మెదక్ నుంచి నీలం మధు, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ మాత్రమే ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు. పెండింగ్ లో ఉన్న మూడు స్థానాల్లో ఖమ్మం స్థానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌కు వెలమ వర్గ అభ్యర్థి.. హైదరాబాద్ సీటుకు ముస్లిం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. అంటే జనరల్ కోటా పన్నెండు సీట్లలో ఏడు రెడ్డి వర్గానికి మూడు బీసీలకు కేటాయిస్తున్నారు. ఒకటి వెలమ, ఒకటి ముస్లింలకు కేటాయిస్తున్నారు. రిజర్వుడు సీట్ల సంగతి పక్కన పెడితే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్ సీట్లలో సగం ఇస్తామన్నారు.చివరికి సగంలో సగం కూడా ఇవ్వలేకపోతున్నారు. సహజంగానే  బీసీ వర్గాల్లో ఇది అసంతృప్తి కలిగిస్తుంది.

అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఖమ్మం నియోజకవర్గం సంప్రదాయంగా కమ్మ సామాజికవర్గానికి కేటాయిస్తారు. అయితే ఈ సారి అక్కడ రెడ్డి వర్గానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో  ఆ సామాజికర్గం కూడా కాంగ్రెస్ అండగా నిలబడింది. మరో వైపు బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆ వర్గం అంతా ఆయనకు పని చేస్తే.. ఖమ్మంలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.ఎస్సీలకు మూడు స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఈ మూడింటిలోనూ రెండు మాల వర్గానికి ఒకటి బైండ్ల వర్గానికి కేటాయించారు. మాదిగలకు ఒక్క సీటు కేటాయించలేదని కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.  మల్లు రవికి నాగర్‌కర్నూల్‌  , గడ్డం వంశీకి పెద్దపల్లి ఖరారు చేశారు. వీరిద్దరూ మాల సామాజికవర్గానికి చెందినవారు. వరంగ్ల కు  కడియం కావ్యను ఖరారు చేశారు. ఆమె తండ్రి కడియం శ్రీహరి మాదిగ ఉపకులం అయిన బైండ్ల వర్గానికి చెందిన వారు.

కావ్య ఓ ముస్లింను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె మాదిగవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆ వర్గం వారు కూడా అనుకోవడం లేదు. ఫలితంగా మాదిగ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది.  ఓట్ల శాతంలో అధికంగా ఉన్నా, జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించక పోవడంతో కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీలోని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాదిగ ఓటర్లు అధికంగా ఉన్నా, మాలవర్గాల నేతలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించడంపై మాదిగలు మండిపడుతున్నారు. పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో తమ మాదిగ వర్గానికి జరిగిన అన్యాయంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజాసంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు.

ఢిల్లీలో గతంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ మాదిగలకు జరిగిన అన్యాయంతో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీలో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.  మోత్కుపల్లి నరసింహులు గురువారం దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో బీజేపీ టికెట్లు ఇద్దరు మాదిగలకు, మాల ఉపకులమైన ఒక నేతకాని వర్గానికి కేటాయించింది.   బీఆర్ఎస్ పార్టీ ఎస్సీల్లోని రెండు వర్గాల నేతలకు టికెట్లు కేటాయించి, సమన్యాయం చేసింది. మూడు స్థానాల్లో ఇద్దరు మాదిగ, ఒకరు మాల సామాజికవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేశారు.  మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్  వరంగల్ లోక్ సభకు  గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించారు.  పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గులాబీ బాస్ టికెట్‌ ఇచ్చారు.

మాదిగల్ని ఆకట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్నారు. మందకృష్ణ మాదిగ.. కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో మాదిగల ఓట్లన్నీ.. విపక్షాలకు వెళ్లిపోయాలా చేయడం ఆ పార్టీకి ఇబ్బందికరంగానే ఉంది. ఒక్క మాదిగలే కాదు.. బీసీ వర్గాలకూ సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇబ్బందికరమే. రెడ్డి వర్గం ఓట్లన్నీ వస్తే గెలిచేస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాల మత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కనువిప్పు అయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.