fake certificate
తెలంగాణ

విద్య పేరుతో  నకిలీ సర్టిఫికెట్లు

ఫేక్ డిగ్రీలు, ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ డాక్టరేట్ల వ్యవహారం ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ‘విద్య’ పేరుతో కొందరు చేస్తున్న పనులకు.. చాలా మంది ప్రజలు మోసపోతున్నారు. హైదరాబాద్లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్కు చెందిన పరంజిత్ కౌర్కు గత నెల 31న ఒక ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్లో ఒక ఈవెంట్ జరుగుతోందని, అందులో ప్రముఖులకు, విద్యావేత్తలకు ‘డాక్టర్ ఆఫ్ ఎమినెన్స్’ టైటిల్తో సత్కరిస్తున్నామని ఓ వ్యక్తి ఫోన్లో చెప్పాడు. ఈ ఈవెంట్.. ఈ ఏడాది మే 20-25 మధ్యలో ఉంటుందని, ఆమె కూడా జాయిన్ అవ్వాలని సూచించి, ఒక గూగుల్ ఫార్మ్ పంపించారు. ఆ గూగుల్ ఫార్మ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఫోన్ చేసిన వారు.. ఒక కమ్యూనిటీ (సోషల్ మీడియా) యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా చెప్పారు. ఆమె సదరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని, తన బేసిక్ వివరాలను అందించారు. వారు చెప్పినట్టే.. ఒక ఇంట్రడక్షన్ లెటర్ క్రియేట్ చేసుకున్నారు. లింక్ చివర్లో.. రూ. 500 కట్టాలని ఉండటంతో, ఆమె ఆ డబ్బులను కట్టారు.అలా.. గూగుల్ ఫార్మ్ని ఫిల్ చేసిన తర్వాత.. పరంజిత్ కౌర్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు.

ఆ గ్రూప్ని.. సునీల్ దుబే అనే వ్యక్తి.. 2024 మార్చ్ 23న క్రియేట్ చేసినట్టు తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా.. చాలా మంది ఆ గ్రూప్లో సభ్యులుగా ఉండటాన్ని గుర్తించారు. గ్రూప్లో జాయిన్ అయితే.. సర్టిఫికేట్లు ఇస్తామని.. సభ్యులకు ఆ గ్రూప్ నడుపుతున్నవారు చెప్పారు. ఇక ఈ గ్రూప్లో జాయిన్ అయిన మొదటి 100 మందికి ‘డాక్టర్ ఆఫ్ ఎమినెన్స్’ బహుకరిస్తామని అన్నారు. పరంజిత్ కౌర్ని కూడా ఎంపిక చేశారు.ఆ మరుసటి రోజు.. విక్రమ్శిల యూనివర్సిటీ సెలక్షన్స్ అంటూ.. వాట్సాప్ గ్రూప్లో హడావుడి మొదలైంది. కానీ.. అడ్మిన్ వైఖరిని పరిశీలించి పరంజిత్ కౌర్కు అనుమానాలు మొదలయ్యాయి. అసలు.. ఈ విక్రమ్శిల యూనివర్సిటీ ఎక్కడుంది? అని వెతికే ప్రయత్నం చేశారు. కానీ.. అసలు ఆ యూనివర్సిటీయే లేదని తెలుసుకుని షాక్ అయ్యారు. ఇలా.. గుర్తింపు పత్రాలు, సర్టిఫికేట్లు ఇస్తామని కొందరు ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె అర్థం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చాలా మంది దీనికి మోసపోతున్నారని ఆమెకు అర్థమైంది.ఈ విక్రమ్శిల యూనివర్సిటీపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.

సాక్షాత్తూ రాష్ట్రపతి పేరు వాడుకుని మోసాలకు దిగడంతో కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే యూజీసీ కూడా ఈ ఫేక్ యూనివర్శిటీకి నోటీసులు జారీచేసింది. ఇదొక 100 పర్సెంట్ డిజిటల్ యూనివర్సిటీ అని కొందరు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇదొక ఫేక్ వర్సిటీ అని గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి.. కొన్నేళ్ల క్రితం హరియాణా, దిల్లీలో పలువురిని అరెస్ట్ కూడా చేశారు. కానీ వారి కార్యకలాపాలకు ముగింపు పడలేదనడానికి.. హైదరాబాద్లో జరిగిన తాజా ఘటన ఒక ఉదాహరణ.ఇలాంటి ఫేక్ వర్సిటీల గురించి సునిల్ దూబేని నిలదీశారు పరంజిత్ కౌర్. ఫలితంగా.. ఆమెను వెంటనే గ్రూప్లో నుంచి తొలగించారు. ఇలాంటి స్కామ్లతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటిని అరికట్టేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులిస్తున్నా లేదా ఎవరైనా సమాచారం ఇస్తున్నా.. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలను పరిశీలించాలి. ఉన్న సమాచారంపై నమ్మకం ఉంటే, అప్పుడే.. ముందడుగు వేయాలి. లేకపోతే.. ఇలాంటి ఆన్లైన్ ఎడ్జ్యుకేషన్ స్కామ్లకు బలైపోతారు!