cong-rayala
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

రాయలసీమపై కాంగ్రెస్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల వ్యూహాత్మకంగా ఎన్నికల పోరాటంలో బరిలో నిలుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై తెర వెనుక కొంత మంది సీనియర్లు పని చేస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి వాళ్లు  బయట పెద్దగా కనిపించడం లేదు. కానీ తెర వెనుక మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తికి గురైన నేతల్ని తీసుకుని పోటీకి ఒప్పిస్తున్నారు. రాయలసీమతో పాటు కోస్తాలో బలమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి వ్యూహాలన్నీ గెలవడానికి కాదు.. ఓడించగలిగే శక్తి ఉందని నిరూపించడానికి అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. కొంగు చాపి న్యాయం చేయాలని ప్రజల్ని కోరారు. ఆమె ప్రకటనతో ఒక్క సారిగా వైసీపీలో ప్రకంపనలు వచ్చాయి.  అలాగే వైఎస్ వివేకా హత్య కేసును చర్చనీయాంశం చేశారు.

అయితే కోర్టుకెళ్లి ఎవరూ మాట్లాడకుండా ఆర్డర్స్ తెచ్చుకున్నారు వైసీపీ నేతలు. కానీ ప్రజల్లో చర్చ మాత్రం ఆగే అవకాశం  కనిపించడం లేదు. కడప నుంచి ప్రారంభించి షర్మిల కర్నూలులోనూ ప్రచారం చేశారు. షర్మిల సభలకు జనం ఉరకలెత్తకపోయినా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆదరణ ఉంది అనిపించేలా వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం సభలు పెట్టేంత వెసులుబాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు షర్మిలసభ అంటే.. జన సమీకరణ చూపించగలుగుతున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో షర్మిల చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి.  సునీత కూడా షర్మిలతో ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు తర్వాత కూడా రాయలసీమలోనే షర్మిల ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కొన్ని కీలక నియోజకవర్గాలపై గురి పెట్టి.. ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ కు వచ్చే ప్రతి ఓటు వైసీపీదేనన్న అభిప్రాయం ఉంది. ముస్లిం, దళిత ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంతో మహిళా ఓటర్లూ వైసీపీకి  దూరమవుతారని.. తమకు దగ్గరవుతారని కాంగ్రెస్ అనుకుంటోంది.  ఫర్మిల రాయలసీమలో సీట్లు గెలవలేకపోవచ్చు కానీ.. వైసీపీ ఓటమిని శాసిస్తే మాత్రం.. తర్వాత ఆమెదే రాజకీయ భవిష్యత్ అయ్యే అవకాశం ఉంది.

షర్మిలనే ప్రజలు వారసురాలిగా గుర్తిస్తున్నరన్న అభిప్రాయం పెరుగుతుంది. వైసీపీ ఉనికి ప్రమాదంలో పడుతుంది.. మళ్లీ కాంగ్రెస్సే ముందుకు వస్తుంది. ఈ వ్యూహంతోనే షర్మిల అడుగులు వేస్తున్నట్లుగా  చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంంది.  షర్మిల ప్రత్యేకంగా ఓ బ్యాకప్ టీముని ఏర్పాటు చేసుకుని కీలకమైన నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ప్రభావం చూపే నాయకుల్ని ఆకర్షించి మరీ టిక్కెట్లు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మాజీ మంత్రి వైసీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.  ఎమ్మెల్యేలంతా దళితులే. అంతే కాదు నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఖరారు చేసిన వారిలో చాలా మంది తమ తమ సామాజికవర్గాల్లో అంతో ఇంతో పట్టున్నవారే. పైగా ఆర్థికంగానూ  బలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నారు.  నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వీరంతా  వైసీపీకి వీర విధేయులు. టిక్కెట్ ఇవ్వకపోయినా చాలా రోజులు పార్టీని వీడలేదు.

అయినా ఆ పార్టీని వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న తర్వాత షర్మిల టీం చర్చలు జరిపి వీరిని పోటీకి అంగీకరింప చేసింది.  ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి .. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ లో చేరి.. టెక్కలి నుంచి పోటీ  చేయడానికి సిద్ధమయ్యారు.ఇలా కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్ని నిలబెడుతోంది. అయితే వీరి బలం గెలవడానికి సరిపోదు. కానీ ఓడించడానికి ఉపయోగపడుతుంది.  కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఏ స్థానంలోనూ నోటాను మించి ఓట్లు రాలేదు. కానీ  ఈ సారి షర్మిల ప్రభావం గట్టిగా కనిపించనుంది. కీలకమైన స్థానాల్లో పది నుంచి  పదిహేను వేల ఓట్లు చీలిస్తే పోటీలో ఉన్న కొంత మంది అభ్యర్థుల జాతకాలు తారుమారు అవుతాయి. అంత బలం చూపించేవారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు. కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ్నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీకి సాయం అందుతోంది.  రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు.

విశాఖ బహిరంగసభలోనూ ప్రసంగించారు.  కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రతి ఓటు వైసీపీకి లాసే.    పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతుల తీసుకుంటే తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని గతంలో రేవంత్ ప్రకటించారు. ఆ ప్రకారం ఆపరేషన్ నిర్వహిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ కు పని చేస్తే.. టీడీపీకి ఎలా మేలు చేసినట్లన్న డౌట్ రావొచ్చు.  అదే రాజకీయం. కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీలిస్తే.. వైసీపీకి అంత డ్యామేజ్. కర్ణాటక నుంచి కూడా సహకారం అందుతోందని చెబుతున్నారు. అన్నీ కలసి వస్తే షర్మిల కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఏపీలో బలంగా  చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల సానుభూతి లభించి.. కడపలో సంచలనం సృష్టిస్తే.. ఇక తిరుగు ఉండదని అనుకోవచ్చు.