brs
తెలంగాణ రాజకీయం

గులాబీలో వర్గ విబేధాలు

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కీలక నాయకులు బయటికి వెళ్లిపోతూ బలహీనంగా మారుతున్న సందర్భంలో ఉన్న నాయకుల మధ్య వర్గవిభేదాలు రాజు కుంటున్నాయి. మహబూబాబాద్‌లో సభా వేదిక మీద బీఆర్ఎస్‌లో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై మాలోత్ కవిత పోటీ చేస్తున్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీ. మంగళవారం ఆమె నామినేషన్ వేశారు. అనంతరం, నిర్వహించిన ఓ కార్యక్రమంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు వేదిక మీద బయటపడ్డాయి. మాలోత్ కవిత ఈ ఘర్షణను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ల మధ్య చిచ్చు రగిలింది. వేదిక మీది నుంచే శంకర్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో ఉండి మరో పార్టీకి సేవ చేయడం మంచిది కాదని మాట్లాడారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని కామెంట్ చేశారు. అలాంటివి పునరావృతం కావొద్దని అన్నారు.

అలాంటి వారిపై పార్టీ హైకమాండ్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం రేగింది. ఎమ్మెల్సీ రవీందర్ కూడా మైక్ తీసుకుని మాట్లాడారు. దీంతో ఎమ్మెల్సీ రవీందర్ రావు శంకర్ నాయక్‌ను ఉద్దేశించి.. పరిహాసంగా ఉన్నదా? వేదిక మీద ఏం మాట్లాడుతున్నావ్? అని అన్నట్టు తెలిసింది. ఇంతలోనే మాలోత్ కవిత శంకర నాయక్ దగ్గరి నుంచి మైక్ తీసుకుని జై తెలంగాణ అనే నినాదాలు ఇచ్చారు. మళ్లీ మైక్ తీసుకున్న శంకర్ నాయక్ తన మైక్ తీసుకుని ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించారు. ‘చూసుకుందామంటే చూసుకుందాం’ అని అన్నారు. ఇక్కడ ఎవరూ భయపడటం లేదని వివరించారు. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర సీనియర్ నాయకులు వారికి సర్దిచెప్పారు.అసలే బీఆర్ఎస్ బలహీనపడుతున్నది. సీనియర్లు జంప్ అవుతుండటం, కాంగ్రెస్, బీజేపీ దూకుడు అనూహ్యంగా పెరగడం ప్రధానంగా కారు పార్టీకి ఇబ్బందిగా మారింది.

లోక్ సభ ఎన్నికల్లో విజయంతో అసెంబ్లీ ఓటమితో కలిగిన నైతిక బలహీనతను సరిచేయాలని అనుకుంటున్నది. కానీ, పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్‌డ్ ఎంపీ స్థానం నుంచి మూడు పార్టీల నుంచీ సీనియర్ నాయకులే బరిలో ఉన్నారు. ముగ్గురికీ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉన్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా మాలోత్ కవిత 2019లో తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టారు. అంతకు ముందు బీఆర్ఎస్ టికెట్ పైనే గెలిచి అజ్మీరా సీతారాం నాయక్ పార్లమెంటుకు వెళ్లారు. ఇప్పుడు సీతారాం నాయక్ బీజేపీ టికెట్ పై మహబూబాబాద్ నుంచి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. బలరాం నాయక్ కూడా పార్టీ బలంగా ఉన్నప్పుడు గెలవడమే కాదు.. కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ సారి రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తున్న నైతికంగా ధైర్యం, కార్యకర్తల ఉత్సాహం బలరాం నాయక్‌కు ఉపయోగపడవచ్చు.మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా.. అందులో భద్రాచలం మినహా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్‌లు కాంగ్రెస్ చేతిలోనే ఉండటం బలరాం నాయక్‌కు కలిసి రానుంది.గత లోక్ సభ ఎన్నికల్లోనూ బలరాం నాయక్‌కు మంచి ఓట్లే వచ్చాయి. గెలిచిన మాలోత్ కవితకు 4.62 లక్షల ఓట్లు పడగా.. బలరాం నాయక్‌కు 3.15 లక్షల ఓట్లు పడ్డాయి. ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ సారి బలరాం నాయక్‌ గెలిచి తీరుతారని హస్తం వర్గాలు చెబుతున్నాయి.