sagar
తెలంగాణ ముఖ్యాంశాలు

సాగర్ నుంచి నీటి తరలింపు

నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా తరలించడాన్ని తెలంగాణ ఆక్షేపించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.. కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.టెయిల్‌పాండ్‌ గేట్లు ఎఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు ఈ రాష్ట్రం నీటిని విడుదల చేసుకుందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాగర్‌ నుంచి ఆ రాష్ట్ర కోటా కింద విడుదల చేస్తున్న నీటి వాటా 5.5 టీఎంసీల్లో.. ఈ నాలుగు టీఎంసీల నీటిని మినహాయించాలని ఆయన కోరారు. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి పరిమితికి మించి ఏపీ నీటిని తరలిస్తున్నట్టు తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ తాగునీటి అవసరాలు కోసం బోర్డు చేసిన కేటాయింపులను మించి తరలిస్తోందని వెల్లడించారు.

కృష్ణా బేసిన్‌ అవతలి అవసరాలకు నీటిని మళ్లిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బోర్డు చైర్మన్‌ శివనందన్‌ స్పందిస్తూ.. తెలంగాణ కూడా కేటాయింపులు కన్నా అధికంగానే వినియోగించిందన్నారు. ఇటీవల రెండు టీఎంసీల జలాలను సాగర్‌ నుంచి తీసుకుందని ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ఫర్యాదుపై కృష్ణా బోర్డు కూడా స్పందించింది. దీనిపై సోమారం సాయంత్రం కృష్ణా బోర్డు ఏపీకి లేఖ రాసింది. టెయిల్‌ పాండ్‌లో నిల్వ ఉంచిన నీటిని ఏపీ తరలించుకకోవడం సరైన చర్య కాదని ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులపై చర్చించేందుకు సోమవారం కృష్ణా బోర్డు ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైకోర్టులో కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి తెలంగాణ హాజరుకాలేదు.