తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ , సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీరు పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి.కొవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టు లో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ సారీ చెప్పారు. పత్రికల్లో క్షమాపణల యాడ్స్ కూడా ప్రచురించినట్లు వెల్లడించారు. క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ కోర్టుకు తెలిపింది.
అయితే ఆ క్షమాపణల యాడ్స్ సైజు విషయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే యాడ్‌ల సైజ్‌లోనే, అదే ఫాంట్‌లో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారా? అని ప్రశ్నించింది. దీంతో తాజాగా బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో పెద్ద సైజులో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు.