తెలంగాణ రాజకీయం

గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం

తెలంగాణలో ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అస్త్రంగా మలుచుకొని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. ఆరు హామీలతోపాటు రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాల అమలు తీరుపై విమర్శలు చేస్తున్నాయి. కేవలం తప్పడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్న బీఆర్‌ఎస్‌… వాటిపైనే ఫోకస్ పెట్టంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి వాటిపైనే ప్రశ్నలు సంధిస్తోంది. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. అధినేత నుంచి సోషల్ మీడియా ఫాలోవర్ వరకు రైతుల సమస్యలనే ప్రధాన అస్త్రంగా చేసుకొని కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రతి సభలో చెప్పినట్టు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ మధ్య జరిగిన ఓ సభలో వీటికి సమాధానంగా రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగస్టు కచ్చితంగా రుణ మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యంగా హరీష్ రాజకీయల నుంచి తప్పుకుంటాలా అని సవాల్ చేశారు. ఇలా మొదలైన యుద్ధం ఇప్పుడు పీక్‌కు చేరుకుంది. ఒకేసారి రుణ మాఫీ చేస్తే తాను రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచే తప్పుకుంటానని హరీష్ సవాల్ చేశారు అలాగనే గన్‌పార్క్ వద్ద ప్రమాణ చేస్తానని… రేవంత్ కూడా రావాలని పిలుపునిచ్చారు. అన్నట్టుగానే ఈ ఉదయం హరీష్‌ రావు గన్ పార్క్ వద్దకు రాజీనామా పత్రంతో వచ్చారు. రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు హరీష్‌రావు తన అనుచర గణంతో చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నాయి. అయితే ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన్ని తప్పి పంపించారు. పోలీసుల జోక్యం చేసుకోవడంతో కాసేపు గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు… రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. రేవంత్ రాలేని పక్షంలో తన సిబ్బందితోనైనా రాజీనామా పత్రాన్ని పంపించాలని సూచించారు. అందరి ముందు ఇద్దరి రాజీనామా పత్రాలను పెడతామని… అన్న మాట ప్రకారం ఆగస్టు 15 లోపు ఏక కాలంలో ప్రతి రైతుకి ఉన్న రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలన్నారు. లేకుంటే రాజీనామాలు ఆమోదించుకొని రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందని ఇప్పుడు రుణ మాఫీ అంటూ మరొ కొత్త మోసానికి తెరలేపిందన్నారు హరీష్‌. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమకు రాజీనామాలు లెక్క కాదన్నారు.  ఆ రైతుల రుణమాఫీ కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని… రేవంత్ రెడ్డి సిద్ధమా కాదా అనేది తేలాలన్నారు.