ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తామని.. ఒకవేళ ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘సీ విజల్ యాప్ ద్వారా ఇప్పటివరకూ 16,345 ఫిర్యాదులు అందాయి. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 10,403 ఫిర్యాదులు కచ్చితమైనవిగా గుర్తించి పరిష్కరించాం.

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 156 మందికి గాయాలయ్యాయి. సీజ్ లకు సంబంధించి 9 వేల కేసులు నమోదు చేశాం. 14 నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం. అలాగే, ఈ సెగ్మెంట్లలో భద్రత పెంచుతాం. ఎండల తీవ్రత దృష్ట్యా ఓటర్లకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఈ కేంద్రాల్లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను నియమిస్తాం’ అని సీఈవో పేర్కొన్నారు.’రాష్ట్రంలో మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే.. హోం ఓటింగ్ కోసం కేవలం 28,591 మంది మాత్రమే ఎంచుకున్నారు. కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 8తో ముగుస్తుంది.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సైతం మే 8వ తేదీలోపే పూర్తి చేస్తాం. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చాం. ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు వేరే గుర్తులు కేటాయించాం. విశాఖ పార్లమెంట్ పరిధిలో 3 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయి. మంగళగిరి, తిరుపతి సెగ్మెంట్లలోనూ 3 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయి. 15 వేల బ్యాలెట్ యూనిట్లు అదనంగా తెప్పించాం. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలీస్ అధికారులకు పంపించాం. ఎవరికైనా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటే వారికి సెక్యూరిటీ ఇవ్వాలని సూచించాం. 374 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 64 మంది పార్లమెంట్ అభ్యర్థులకు భద్రత కల్పించాలని సూచించాం. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమ నగదు, అక్రమ మద్యం సరఫరాను అరికడుతున్నాం.’ అని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.