భారత్‌ను గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా.. మరో కవ్వింపు చర్యకు దిగింది. పీవోకేలో రోడ్లు నిర్మించిన విషయం వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మరో దుస్సాహసానికి యత్నించింది. భారత్‌తో ఇటీవల దౌత్యపరంగా విభేదాలు వచ్చిన మాల్దీవులను మచ్చిక చేసుకున్న చైనా.. తాజాగా ఆ దేశ జలాల్లోకి కొన్ని రోజులు పరిశోధనకు ఉంచింది. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన పరిశోధక నౌక ‘షియాంగ్ యాంగ్ హాంగ్–03’ తిలాపుషీ ఇండస్ట్రియల్ హార్బర్‌లో లంగర్ వేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ నౌక ఎందుకు తిరిగొచ్చిందన్న విషయాన్ని మాల్దీవుల్లో ఇటీవల అధికారం చేపట్టిన ముయిజ్జు సర్కారు వెల్లడించలేదు.సుమారు 4,500 టన్నుల బరువున్న ఈ పరిశోధక నౌక ఈ ఏడాది జనరవరిలో చైనాలోని సన్యా నుంచి బయల్దేరింది. దాదాపు నెలరోజులు మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ సరిహద్దుల్లో తిరిగింది. తర్వాత ఫిబ్రవరి 23న తిలాపుషీ పోర్టుకు చేరుకుని దాదాపు వారం రోజులు అక్కడే ఉండి వెళ్లిపోయింది. మళ్లీ రెండు నెలల తర్వాత ఈ నౌక ఇప్పుడు మళ్లీ మాల్దీవులు తీరానికి చేరుకుంది.
ఈ నౌక చైనాలోని థర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషలోగ్రఫీకి చెందినది. సముద్ర గర్భంలో పరిస్థితులు, ఖనిజా న్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు చేస్తుంది. గతంలో ఇదే తరహా నౌకలు శ్రీలంక తీరంలో కార్య కలాపాలు నిర్వహించాయి. ఇవి జలాల్లో మాత్రమే పరిశోధనలు చేస్తున్నట్లు చైనా చెబుతున్నా భారత్‌లోని కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగనతలంపై నిఘా ఉంచేందుకే భారత సరిహద్దుల్లోకి చైనా తీసుకొస్తోందని భారత అధికారులు అనుమానిస్తున్నారు. మన పోర్టులు, అణు కేంద్రాలపై నిఘా పెడుతున్నట్లు భావిస్తున్నారు.ప్రస్తుతం చైనా నౌక మాల్దీవుల ప్రాంతంలో లంగరేసింది. భారత్‌లోని లక్ష్య ద్వీప్‌లో ఉన్న మినికోయి ద్వీపానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. దీనిని భారత నేవీ నిశితంగా గమనిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.