జాతీయం రాజకీయం

3వ విడత కోసం ముమ్మర ఏర్పాట్లు

మూడో పోలింగ్ కోసం ఏర్పాటు చకచకా సాగుతున్నాయి. మంగళవారం  13 రాష్ట్రాల్లో 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 13 రాష్ట్రాలున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ దశలో ఈ రెండు కూటములతో పాటు కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు, దేశంలోని అనేక రాజకీయ కుటుంబాలు సైతం ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నాయి.ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ  అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సహా ములాయం కుటుంబానికి చెందిన ముగ్గురు మూడో దశలో ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబం సైతం తమ రాజకీయ సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది.

మోడీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, డా. మన్సుఖ్ మాండవియా, విజయ్ రూపాలా, ఎస్పీ సింగ్ బఘేల్‌తో పాటు బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం మూడో దశలో ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌లు సైతం మూడో దశలో ఎన్నికల పరీక్ష ఎదుర్కోనున్నారు. మొత్తంగా మూడవ దశ ఎన్నికల బరిలో ఉన్న హై ప్రొఫైల్ నేతల్లో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి.. ఎవరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనున్నారో చూద్దాం
అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. గత పర్యాయం ఈ స్థానం నుంచి గెలిచి ఎంపీ అయిన షా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్‌తో తలపడుతున్నారు. గాంధీనగర్ స్థానం భారతీయ జనతా పార్టీకి బలమైన కోటగా పరిగణిస్తారు. అమిత్ షా కంటే ముందు లాల్ కృష్ణ అద్వానీ ఇక్కడ నుంచే ఎంపిగా ప్రాతినిథ్యం వహించారు. అమిత్ షా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలవగా.. ఇప్పుడు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
జ్యోతిరాదిత్య సింధియా..
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి ఎన్నికల్లో తన పాత కోట ‘గుణ’ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. సింధియా ఈసారి ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై పోటీ చేయగా, గత పర్యాయం కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సింధియా బీజేపీ అభ్యర్థిగా పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యదువేంద్ర సింగ్ యాదవ్ నుంచి సింధియా పోటీ ఎదుర్కొంటున్నారు. యదువేంద్ర యాదవ్ బీజేపీలో ఉండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు.
మన్సుఖ్ మాండవియా..
మోదీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా మూడో దశ పోలింగ్‌లో అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. మాండవ్య గుజరాత్‌లోని పోర్‌బందర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ భాయ్ వసోయాతో తలపడుతున్నారు. పోర్‌బందర్ లోక్‌సభ స్థానం బీజేపీకి బలమైన స్థానాల్లో ఒకటి. నిరంతరం విజయాలను నమోదు చేస్తోంది. అయితే ఈసారి ఇక్కడ గట్టి పోటీ నెలకుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎస్పీ సింగ్ బఘేల్..
మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎస్పీ సింగ్ బఘేల్ మూడో దశలో ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఆగ్రా రిజర్వ్‌డ్ స్థానం నుంచి ఎస్పీ బఘేల్‌పై సమాజ్‌వాదీ పార్టీనుంచి సురేశ్ చంద్ర కదమ్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పూజా అమ్రోహి బరిలోకి దిగడంతో త్రిముఖ పోరుకు దారితీసినట్టయింది. దళితుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో బీఎస్పీ ఎన్నడూ గెలవలేకపోయింది. అయితే ప్రతిసారీ రెండో స్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. పూజా అమ్రోహి వ్యక్తిగత ఇమేజి తోడవడంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది.
సుప్రియా సూలే..
మూడో దశ లోక్‌సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కుటుంబం అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన సాంప్రదాయ బారామతి స్థానం నుంచి మూడోసారి పోటీ చేశారు. సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సీటు కాపాడుకోవడమే సుప్రియా సూలేకు ఒక పెద్ద సవాల్‌‌గా మారింది.
శివరాజ్ సింగ్ చౌహాన్..
మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈసారి ‘విదిశ’ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మతో పోటీ పడుతున్నారు. శివరాజ్ సింగ్ 20 ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకు ముందు 2005 వరకు ఈ స్థానం నుంచి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుని మళ్లీ విదిశ స్థానం నుంచే బరిలోకి దింపింది.
డింపుల్ యాదవ్..
మైన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం సింగ్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని కైవసం చేసుకునేందుకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ను బరిలోకి దించారు. ఈ స్థానంలో బీజేపీ జైవీర్‌ సింగ్‌ను బరిలోకి దించగా, బీఎస్పీ నుంచి శివప్రసాద్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1996 నుంచి ఈ సీటును సమాజ్‌వాదీ పార్టీయే గెలుచుకుంటూ కంచుకోటగా మార్చుకుంది. మోడీ హవాలోనూ ఆ పార్టీ ఈ సీటును నిలుపుకోగలిగింది. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ముక్కోణపు పోటీలో బీజేపీ ఈసారి ఈ సీటును గెలుపొందాలని ప్రయత్నిస్తోంది.దీంతో పాటు ములాయం కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు కూడా ఈ దశలోనే ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ ‘బదౌన్’ స్థానం నుంచి, రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ ఓడిపోయినా ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఈ పరిస్థితుల్లో ములాయం కుటుంబం సీట్లు కాపాడుకుంటుందో లేదో చూడాలి.
దిగ్విజయ్ సింగ్..
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాజ్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1991లో దిగ్విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి భారీ ఓట్లతో గెలుపొందారు. రాజ్‌గఢ్ ఆయన సంప్రదాయ స్థానం, అందుకే కాంగ్రెస్ ఆయనను పోటీకి దింపింది. ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థి రోడ్మల్ నాగర్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. మోడీ వేవ్‌లో ఈ సీటును బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది.