చేసే మాటలకు.. చేపట్టే చేతలకు పొంతన ఉండదు. ఇందులో ఏ పార్టీ కూడా అతీతం కాదు. మొన్నటి వరకూ బీజేపీ కొంత మెరుగు అని భావించేవారు చాలా మంది ఉన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు తాము దూరం అంటూ పదే పదే ఊదరగొడుతుంటారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా మోదీ నోట అయినా, అమిత్ షా చెప్పినా ఇదే మాట. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి ఈ రెండు ఉన్న పార్టీతోనే పొత్తుపెట్టుకుందన్న విమర్శలు మాత్రం బీజేపీపై బలంగానే వినపడుతున్నాయి. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న మోదీ మరోసారి వారసత్వం అనే పదాన్ని ఉచ్చరించగలరా? అన్న ప్రశ్న తలెత్తుంది.గత ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అంటే అవినీతికి పాల్పడ్డారని ఆయన నోటి నుంచే విమర్శలు వెలువడ్డాయి. పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక పథకాలలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని, జన్మభూమి కమిటీల దోపిడీకి దిగాయని కూడా బీజేపీ నేతలు గత ఎన్నికల్లో ఆరోపించారు. అంతా నిజమే అనుకున్నారు.
మోదీ అవినీతి వ్యతిరేక పార్టీతో పొత్తుకు దిగరని భావించిన వారు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మోదీ నుంచి కిందిస్థాయి నేత వరకూ నాడు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారే. ప్రతి పథకంలో అవినీతి జరిగిందని నినదించిన వారే.తుప్పపట్టిన సైకిల్ లో పనిచేసేది ఒక బెల్ మాత్రమే మాటలకు విరుద్ధంగా… కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా ఏపీలో పొత్తులు కుదరడం కూడా చర్చనీయాంశమైంది. పొరుగున ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శించాలంటే అవినీతి, కుటుంబ పాలన, వారసత్వం అంటూ పదే పదే అదే పదాలను వల్లె వేసే నరేంద్ర మోదీ ఏపీకి వచ్చే సరికి గొంతు మార్చారు. మార్చారు అనుకోవాలా? సవరించుకున్నారా? అన్నది మోదీయే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ వారసత్వ పార్టీయే. ఆ పార్టీలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే.. జాతీయ ప్రధానకార్యదర్శి ఆయన తనయుడు నారా లోకేష్.
మరి వారసత్వ రాజకీయాలకు తాము దూరం అంటూ ఊదరగొట్టే కమలనాధులు ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అంటే మోదీలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని, ప్రాంతాలను చూసి, పరిస్థితులను బట్టి ప్రసంగాలను మార్చడంలో మోడీ దిట్ట అని అను కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించరు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనైనా కలవొచ్చు. అధికారమే లక్ష్యంగా స్థానాలను సంపాదించుకోవడం కోసం ఎన్ని ఫీట్లు అయినా చేయవచ్చు. కానీ పక్కనే ఉన్న తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ లో మరొకలా మాట్లాడితే జనం హర్షించరన్న విషయాన్ని మోదీ గుర్తుంచుకుంటే మంచిదన్న సూచనలు కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. రాష్ట్రానికి ఒక నాలుక అయితే ఎలా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.