ఈ ఎన్నికల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. దళిత, గిరిజన ద్రోహి జగన్ అని విమర్శించారు చంద్రబాబు. ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ అని ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు.ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని విమర్శించారు. 60 శాతం సబ్సిడీతో ట్రైకార్ రుణాలిచ్చేవాళ్లం అని.. ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ పాలనలో ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారని ఆరోపించారు. జీవో నెం.3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలిచ్చామని.. కానీ జగన్ వచ్చాక జీవో నెం.3ని రద్దు చేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయకూడదు ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవో నెం.3 తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు.