ఏపీ సీఎం జగన్ తనకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న తన సతీమణి భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి వ్వాలని ఆయన పిటిషన్ లో కోరారు. తన కూతుళ్లను కలిసేందుకు వెళ్తున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ పిటిషన్ పై గురువారం విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని న్యాయస్థానానికి తెలిపింది. ‘ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయి. ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదు. ప్రతి కేసులో జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉంది.’ అని సీబీఐ పేర్కొంది.అయితే, దీనిపై జగన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
జగన్ గతంలోనూ అనేకసార్లు విదేశాలకు వెళ్లారని.. ఎక్కడా కూడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని కోర్టుకు తెలిపారు. రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని కాలరాయడం సరికాదని అన్నారు. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.