దేశంలో మరోసారి నరేంద్రమోదీయే ప్రధాని అవుతారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని జేజేనగర్‌లోని మహాభోది ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన తమిళుల ఆత్మీయ సమావేశంలో అయన మాట్లాడారు. మోదీ హయాంలో దేశంలో మోడరన్ రైల్వే స్టేషన్లు నిర్మాణం, రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దేశంలో పేదల కోసం 12 కోట్ల టాయిలెట్లు కట్టించారన్నారు. జీఎస్టీని అమలు చేసిన గొప్ప నాయకుడు మోదీ అని ఆయన కొని యాడారు. దేశంలో టెర్రరిజంను అణచివేసి శాంతి నెలకొల్పిన ఘనత బీజేపీ(BJP) ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం అంటే అభివృద్ధే కాదని, ప్రజల విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రామ మందిరాన్ని నిర్మించారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి తెచ్చిన ఘనత మోదీకి చెందుతుందని ఈటల చెప్పారు.
దేశం సుస్థిరంగా ఉండాలన్నా, మన సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలన్నా దేశంలో బీజేపీతోనే సాధ్య మన్నారు. అల్వాల్ ప్రాంతంలో ఫ్లై ఓవర్లు నిర్మాణం, పేదల ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. మల్కాజిగిరి అభివృద్ధికోసం అనునిత్యం పాటుపడతానని, ఎల్లప్పుడు అందరికీ అందుబాటులో ఉంటానని, ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఈటల ఓటర్ల్లను కోరారు. ఈ కార్యక్రమంలో కొయంబత్తూరు ఎమ్మెల్యే, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వాసతి శ్రీనివాసన్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణబాబు, నాయకులు గోపు రమణారెడ్డి, రమేష్ గౌడ్, ధనలక్ష్మి, రవీందర్‌రెడ్డి, ప్రసన్న, కన్నాభిరాన్ ఇతర నాయకులు, స్థానికులు, తమిళ కుటుంబాలు పాల్గొన్నాయి.