తెలంగాణ రాజకీయం

దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోంది

దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ అవాస్తవాలు మాట్లాడు తోందన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏంటి? అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు తమ పథకాలతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ నాయకులు కన్ఫ్యూజ్ అవుతూ.. ప్రజలను ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి ఎగనామం పెట్టడంలో బీజేపీ నాయకులని మించిన వారు ఉండరని సెటైర్లు గుప్పించారు. ప్రతి విషయంలో బీజేపీ నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రగల్భాలు పలుకుతారని జగ్గారెడ్డి విమర్శించారు.

మోసం అంటే ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్‌కి తెలియదన్నారు. చెప్పిన పనిని, ఇచ్చిన మాటను అమలు చేయటం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తెలుసునని అన్నారు. తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని రావటం వేరని.. విలీనం వేరని చెప్పారు. ఈ విషయంలో లక్ష్మణ్ రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు.బీఆర్ఎస్ నుంచి 20 మంది.. బీజేపీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌‌లో ఉన్నారని.. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలా వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పారు. లక్ష్మణ్‌కి పొలిటికల్ చిప్ కారాబ్ అయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకొని రావాలని… కావాలంటే దానికి అయ్యే ఖర్చునూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఇస్తుందని జగ్గారెడ్డి సెటైర్లు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్   వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  అన్నారు.

మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.పోలీసులు వ్యవస్థని దుర్వినియోగం చేయలేదన్నారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని తెలిపారు.తమ ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు.