ఆంధ్రప్రదేశ్ రాజకీయం

దొంగ ఓట్లు వేస్తూ… అడ్డంగా…

దేశ చరిత్రను తిరగరాసే ఆయుధం ఓటు. ఒక దేశం ఎలా ఉండాలో ఓటు నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, తమ వైపు తిప్పుకోవడానికి పార్టీలు, నాయకులు పెద్ద ఎత్తున కానుకలు అందిస్తుంటారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్ది ఓటర్లకు తాయిళాలు అందిస్తుంటారు. ఇందులో ప్రధానంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం ఒకటి. ఓటును అమ్మకోవద్దు, డబ్బు తీసుకోవద్దు, పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఎన్ని చెప్పినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోని వారు, ఏమీ తెలియని వారు డబ్బుకు ఆశపడి ఓటు అమ్మకుంటుంటారు.ఓటుకు నోటు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తూనే ఉంటుంది. అందుకు పోలీసులు, అధికారులను ఉపయోగించుకుంటుంది. ఓటుకు నోటు తీసుకోకూడది చెప్పాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ ఓటును అమ్మకానికి పెడుతున్నారు. నేతలు ఇచ్చే కాసులకు ఆశపడి ఓటును అమ్మేసుకుంటున్నారు.

ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్న ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఓటు వేసేందుకు డబ్బు తీసుకున్న ఓ పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారు. డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్‌ఐ తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజా బాబుకు ప్రకాశం జిల్లా కురిచేడులో ఓటు ఉంది. ఎస్‌ఐతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు తీసుకుని.. ఎస్ఐకి ఆన్ లైన్‌లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో సదరు నాయకుడు ఎస్‌ఐకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలింగ్ విధానాన్ని మార్చిన ఈసీ
పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఉద్యోగులు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి అక్కడే ఓటు వేసి వెళ్లాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. గతంలో ఉద్యోగులు ఇంటి వద్ద ఓటు వేసి దాన్ని సంబంధిత అధికారులకు నేరుగా కానీ, పోస్టల్‌లో పంపించేవారు. కానీ ఈ సారి ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి బ్యాలెట్‌ పేపరు తీసుకుని అక్కడే ఓటు వేసి బాక్సులో వేశారు.  ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 24,631 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఒంగోలు అసెంబ్లీలో 5,884 మంది, గిద్దలూరులో 3,772 మంది, కనిగిరిలో 3,003 మంది, మార్కాపురంలో 3,100 మంది ఉన్నారు. ఒంగోలు, దర్శి లాంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రధాన పార్టీలు పంపిణీ చేశాయి. మిగతా నియోజకవర్గాల్లో రూ.3వేల నుంచి రూ.5 వేలు వరకు అందజేశారు.