ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వెంటాడుతున్న పీకే…

గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయానికి ప్రశాంత్ కిషోర్ ఒక కారణం. వైసీపీకి రాజకీయ వ్యూహ కర్తగా వ్యవహరించిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏపీలో చక్కగానే పనిచేశాయి. అంతకు ముందున్న టిడిపి ప్రభుత్వం పై విషం చిమ్మడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ప్రజలను వర్గాలుగా విభజించి వైసిపి వైపు టర్న్ అయ్యేలా బాగానే పనిచేశారు. పోలింగ్ నాడే వైసిపి ఘనవిజయం సాధిస్తుందని ప్రక టించారు. ఏకంగా జగన్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే అదే ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని తేల్చి చెప్పారు. పదే పదే అదే మాట చెబుతూ వైసీపీ శ్రేణుల్లో కలవరానికి కారణమవుతున్నారు. తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఎలక్షన్ కమిషన్, అధికార యంత్రాంగం పై నిట్టూర్పు మాటలతో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేయడంతో.. ఎక్కడో తేడా కొడుతుందన్న కామెంట్స్ వినిపించాయి. పోలింగ్ కు ముందే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ వైసిపి ఓడిపోతుందని తేల్చి చెప్పారు.

పోలింగ్ ముగిసిన రెండు రోజుల వరకు జగన్ సైతం మీడియా ముందుకు రాలేదు. కానీ విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇచ్చినట్లు వ్యవహరించారు.కానీ ఒక పార్టీ అధినేతగాపార్టీ శ్రేణులతో సమావేశాలు కానీ, సమీక్షలు గానీ జరపలేదు. ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి ప్రకటించడంపై సొంత పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కానీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేసేసరికి వైసీపీ శ్రేణుల్లోఒక రకమైన ధైర్యం వచ్చింది.కొంచెం ఊపిరి పీల్చు కున్నాయి. అయితే జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ మరోసారి వైసీపీపై వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్కు దారుణ ఓటమి ఎదురుకానుందని తేల్చేశారు. జగన్ ధీమా వ్యక్తం చేయడంపై కూడా స్పందించారు. దేశంలో అందరూ గెలుస్తామని చెబుతారని.. గత రెండు ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని.. 2014లో కూడా గెలుస్తానని జగన్ ప్రకటించారని.. లెక్కింపు నాడు నాలుగు రౌండ్లు పూర్తయినా.. పుంజుకుంటామని చెబుతారని.. ఎన్నికల్లో అది సహజ చర్యగా అభివర్ణించారు.

ఏపీలో వైసిపి ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని.. దానిని ఒప్పుకునే స్థితిలో జగన్ లేకపోవడం విచార కరమన్నారు. ఈసారి ఏపీలో పురుషులు కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. కోటి 69 లక్షల మంది మహిళలు కాగా, పురుషులు కేవలం కోటి 64 లక్షలు మంది. అంటే ఈసారి మహిళ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. లబ్దిపొందిన మహిళలకు తమకు ఓటు వేశారని, అందుకే ఉదయం నుంచి క్యూలో ఉంటున్నారని సీఎం జగన్ అంచనా. అందులో 70శాతం తమకు పడినా విజయం తమదేనన్నది ఆ పార్టీ లెక్క. మహిళలంతా తమవైపు ఉన్నారని పైకి బలంగా చెబుతున్నారు నేతలు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో లబ్దిపొందిన మహిళలు కేవలం 65 లక్షలు మాత్రమే ఇంకా 95 లక్షలు మహిళలు మాటేంటని సైకిల్ పార్టీ నుంచి బలంగా కౌంటర్లు పడిపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలు వైసీపీకి బాగా దెబ్బ కొట్టడం ఖాయమన్నది మరోమాట.2014, 2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను అధికంగా గెలుచుకుంది. టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.

ఈసారి అక్కడే ఓటర్లు రివర్స్ అయినట్టు చెబుతున్నారు. సగానికి పైగానే ఆయా నియోజకవర్గాలను టీడీపీ గెలవనుందని ఓ అంచనా. పోలింగ్ పెరిగిన ప్రతీసారి అధికార పార్టీ ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారీ అదే రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. మొత్తానికైతే వైసీపీలో ఉన్న ఆ కొద్దిపాటి ఆశలను సైతం ప్రశాంత్ కిషోర్ చిదిమేస్తున్నారు. ఆ పార్టీ శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు