ఆంధ్రప్రదేశ్ రాజకీయం

నిలిచిపోయిన ఆరోగ్య సేవలు

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆసుపత్రుల సంఘం సోమవారం లేఖ రాసింది. గతేడాది ఆగస్టు నుంచి రూ.1500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాను విజ్ఞప్తి చేసింది. గత 6 నెలలుగా ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని లేఖలో తెలిపింది. మే 4 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది. సుదీర్ఘ కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. పెండింగ్ బిల్లులపై ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారని లేఖలో పేర్కొంది.మే 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్ వర్క్ ఆసుపత్రుల ట్రస్టు ఇటీవల ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

గతంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు యాజమాన్యాలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశాయి. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు అంటున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని, ఇంకా రూ.850 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు గత నోటీసుల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఇటీవల రాసిన లేఖలో ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నామమాత్రంగానే బిల్లులు విడుదల చేయడంతో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది.ఆరు నెలల్లో నాలుగు సార్లు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. ఆరోగ్య సేవలు అందిస్తు్న్న నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో పెట్టింది.

గత నెలలో రూ.1200 కోట్లు పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం ఇది రూ.1500 కోట్లకు చేరాయని ఆసుపత్రుల సంఘాలు అంటున్నాయి. పదేళ్ల క్రితం ప్యాకేజీలతోనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, శస్త్ర చికిత్సల ఛార్జీలు పెంచాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. గత చర్చల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ బిల్లులు విడుదల చేయలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. బిల్లుల విడుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన చర్చల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయిఏపీ ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య శ్రీ పరిధిని రూ.25 లక్షలు పెంచిందిం. ఆరోగ్య శ్రీ పరిధిలోని చికిత్సలకు కుటుంబానికి రూ.25 లక్షల వైద్యు ఉచితంగా అందిస్తారు.

పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య శ్రీ పథకం చాలా కీలకం. అయితే పెండింగ్ బిల్లుల కారణంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలపై ఆసుపత్రులు ఆసక్తి చూపడంలేదు. ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సలు అందుబాటులో ఉన్నా…ఏదో కారణంతో వేరే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపడమే లేదా రోగులు నుంచి ఫీజులు చెల్లించేలా చేయడమో చేస్తున్నారు. పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందాలంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.