తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ముగిసి దాదాపు ఆరు నెలలు కావోస్తోంది. 11 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కలుపుకుంటే 12 మందితో పాలన సాగుతోంది. అసెంబ్లీ స్థానాలను బట్టి రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. ప్రస్తుతం 12 మందికి అవకాశం దక్కగా, మిగతా ఆరుగురు మంత్రులు ఎవరన్న ఆసక్తి తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. పార్లమెంట్ ఫలితాలు జూన్ నాలుగో తేదీన ప్రకటించనుండటంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమా, లేక ఇండియా కూటమినా అనేది తేలిపోనుంది. ఆ హడావుడి ముగియగానే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తమకు మంత్రి వర్గంలో ఏ సమీకరణాలతో అవకాశం దక్కుతుందా అన్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఆ ఆరుగురు అదృష్టవంతుల్లో తమ పేరు ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64 మంది గెలిచారు. మిత్ర పక్షం సీపీఐ నుండి ఒకరు గెలిచారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం శాసన సభ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా ఉండి పార్టీని నడిపించిన రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా నియమించింది. మంత్రులుగా పార్టీకి విధేయుడుగా ఉండి పని చేస్తూ వస్తున్న భట్టి విక్రమార్కను ఉపముఖ్యమంత్రిగా హస్తం పార్టీ పెద్దలు నియమించారు. ఇక మంత్రుల ఎంపిక చూస్తే పాత నేతలకు, కొత్తగా పార్టీ లో చేరిన నేతలకు సమాన అవకాశం కల్పించారు. పార్టీ విధేయులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తన స్వంత తమ్ముడు బీజేపీలోకి చేరినా.. పార్టీ మారని కోమటిరెడ్డి వెంకట రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అమాత్యులుగా అవకాశం ఇచ్చింది.టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన సీతక్కకు మంత్రిగా అవకాశం దక్కింది. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ లోకి చేరిన జూపల్లి కృష్ణారావుకు, కొండా సురేఖ కు, తుమ్మల నాగేశ్వర రావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం దక్కింది.
పార్టీ కష్టాల్లో ఉన్నా వీడకుండా ఉన్న పాత నేతలకు స్థానం కల్పిస్తూనే, కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశాలు ఉంటాయన్న సంకేతం ఇచ్చేలా.. కాంగ్రెస్ అధిష్టానం కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా మంత్రులుగా అవకాశం ఇచ్చింది. ఇందులో మంత్రిగా ఏ మాత్రం అనుభవం లేని రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం కాగా, మంత్రులుగా గతంలోనే అనుభవం ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇక ఒక్క సారి మంత్రిగా పని చేయని సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు ఉన్నారు. ప్రస్తుత క్యాబినెట్ లో 12 మంది ఎంపిక చూస్తే పది ఉమ్మడి జిల్లాలలో ఆరు జిల్లాలకు అవకాశం కల్గింది. ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు భట్టి, తుమ్మల, పొంగులేటి క్యాబినెట్ బెర్తు దక్కించుకోగా, మహబూబ్ నగర్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డికి, మంత్రిగా జూపల్లికి అవకాశం కల్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి, ఉత్తమ్ లకు అవకాశం దక్కింది. వరంగల్ జిల్లా నుండి సీతక్క, కొండా సురేఖలకు అవకాశం దక్కింది. కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది.
మెదక్ జిల్లా నుండి దామోదర రాజనర్సింహకు అవకాశం కల్పించారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ ల నుంచి, హైదరాబాద్, రంగారెడ్డిల నుండి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదు. ఈ దఫా ఆరుగురు మంత్రులను క్యాబినెట్ లోకి తీసుకునే తరుణంలో ఈ నాలుగు జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుండి గెలిచిన వారిలో చెన్నూరు నుండి వివేక్, బెల్లంపల్లి నుండి ఆయన సోదరుడు వినోద్, ప్రేమ్ సాగర్ రావు, ఖానాపూర్ నుండి వెడ్మ భోజ్జు గెలిచారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి. ఇక నిజమాబాద్ విషయానికి వస్తే మాజీ మంత్రిగా అనుభవం ఉన్న బోధన్ నుండి పి. సుదర్శన్ రెడ్డి, జుక్కల్ నుండి తోట లక్ష్మి కాంతరావు, ఎల్లారెడ్డి నుండి కె. మదన్ మోహన్ రావు, నిజామాబాద్ రూరల్ నుండి భూపతి రెడ్డి గెలిచారు. వీరిలో నిజామాబాద్ నుండి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇబ్రహీం పట్నం నుండి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి నుండి టి.రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుండి గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు నుండి మనోహర్ రెడ్డి గెలిచారు.
వీరిలో గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. దీంతో మంత్రివర్గ ఆశా వాహుల్లో మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలలోఎవరికి అవకాశం దక్కుంతుందో చూడాలి. ఇక హైదరాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోవడంతో ఇటీవలి పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. ఎంపీగా గెలిస్తే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఓడిపోతే… బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ తరపున ఎన్నిక అవుతారా..లేదా మంత్రిగా అవకాశం దక్కించుకున్నాక…….రాజీనామా చేస్తారా అన్నది వేచి చూడాలి. ఒక వేళ ఎంపీగా ఓడిపోతే… మంత్రిగా అవకాశం దక్కించుకుని ఆ తర్వాత రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తే దానం సుళువుగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది హస్తం నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మరో వైపు కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. అక్కడి నుండి కూడా మంత్రి వర్గంలో చోటుకు పోటీ ఉండవచ్చని చెబుతున్నారు.
మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉన్న 12 మంది క్యాబినెట్లో సామాజిక వర్గాలుగా చూస్తే పద్మశాలి నుండి కొండా సురేఖ, గౌడ సామాజిక వర్గం నుండి పొన్నం ప్రభాకర్, బ్రాహ్మణ వర్గం నుండి శ్రీధర్ బాబు, ఎస్సీ సామాజిక వర్గం నుండి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, రెడ్డి వర్గం నుండి రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వెలమ వర్గం నుండి జూపల్లి కృష్ణారావు, ఎస్టీల నుంచి సీతక్క. కమ్మ సామాజిక వర్గం నుండి తుమ్మల కు స్థానం కల్పించారు. ఓసీల నుండి ఏడుగురు, బీసీల నుండి ఇద్దరు, ఎస్సీల నుండి ఇద్దరు, ఎస్టీ ల నుండి ఒక్కరికి అవకాశం దక్కింది.ఆరు బెర్తులకు జిల్లాల వారీగాను, సామాజిక వర్గాల కూర్పు వంటి అంశాలు కీలకం కానున్నాయి. అంతే కాకుండా.. మైనార్టీలకు చోటు కల్పించాల్సి ఉంది. అంతే కాకుండా.. మిత్ర పక్షమైన సీపీఐని క్యాబినెట్లోకి ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతే కాకుండా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేసిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సైతం మంత్రి వర్గంలో చేరేందుకు సంకేతాలు పంపడం విశేషం.
ఇలాంట పరిస్థితుల్లో మిగతా ఆరు మంత్రి వర్గ స్థానాల్లో నుండి ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు , కొత్తగా పార్టీలో చేరిన వారు, తమ సామాజిక వర్గానికి చోటు ఇవ్వాల్సిందే అని కోరుతున్న హస్తం ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన సమీకరణాలతో పార్టీ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు వేగిరం చేస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చన్న భావంతో.. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ అగ్ర నేతల ఆశీర్వాదం కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరకు ఆ ఆరుగురు అదృష్టవంతులెవరో పార్లమెంట్ ఎన్నికల ఫలతాల తర్వాతే తేలనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.