ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సీఎంల సంతానం… నిరూపించుకుంటారా

ఆరుగురు మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రంగంలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఎవరు తండ్రి పేరును నిలబెడతారన్నది మాత్రం ఆసక్తికరంగానే సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ల తనయులు ఈసారి ఒక్కో పార్టీ నుంచి తలపడుతున్నారు. మూడు ప్రధాన పార్టీల్లోనూ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. వీరిలో కొందరు ఓటమి పాలయితే తండ్రి పేరును కూడా సార్థకం చేయలేకపోయినట్లే అవుతుంది. మరి గెలిచి తండ్రి పేరును నిలబడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకు ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య మంత్రిగా పనిచేసి హఠాన్మరణం చెందిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆయన పులివెందుల నుంచి ఈసారి బరిలోకి దిగారు. విజయం సునాయాసమే. మెజారిటీ ఎంత అన్నది మాత్రం ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలో చర్చ జరుగుతుంది.
నారా లోకేష్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజిత ఏపీలోనూ పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్. ఈయన మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నారా లోకేష్ తాత ఎన్టీ రామారావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి కూడా నారా లోకేష్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఎడ్జ్ లో అయినా బయటపడే అవకాశముందని టీడీపీ నేతలు ఈసారి ధీమాగా ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడేంత వరకూ సస్పెన్స్ తప్పేట్లు లేదు.
 నాదెండ్ల మనోహర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెలరోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. ఈయన గతంలో ఉమ్మడి ఏపీ శాసనభకు స్పీకర్ గా వ్యవహరించారు. మృదుస్వభావిగా పేరు. ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా వైసీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో తన గెలుపుపై నాదెండ్ల మనోహర్ ధీమాగా ఉన్నారు. కానీ రిటర్నింగ్ అధికారి నుంచి పత్రాన్ని అందుకునేంత వరకూ అనుమానమేనని చెప్పకతప్పదు.
నందమూరి బాలకృష్ణ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా వ్యవహరించిన నందమూరి తారక రామారావు కుమారుడు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు. సినీ హీరోగా అందరికీ సుపరిచితమే. ఈయన హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నారు. హిందూపురం నియోజకవర్గం పార్టీకే కాకుండా నందమూరి కుటుంబానికి కూడా కంచుకోట కావడంతో ఈయన గెలుపు పై అనుమానం పెద్దగా ఎవరికీ లేదు. అయితే గతంలో కన్నా ఈసారి మాత్రం పోటీని ఎదుర్కొంటున్నారని మాత్రం చెప్పాల్సి ఉంది
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.

ఈయన గతంలో కర్నూలు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. డోన్ లో ఈసారి బలమైన ప్రత్యర్థితో తలపడుతుండటంతో గెలుపు అంత సులువు కాదు. టీడీపీ నుంచే ఆయనకు మద్దతు లభించడం కూడా కష్టమని అంటున్న నేపథ్యంలో ఆయన గెలుపు చివర వరకూ సస్పెన్స్ అనే చెప్పాలి.
 నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి. గతంలో తల్లి నేదురుమిల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన గెలుపు కూడా అంత సులువు కాదు. అక్కడ టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే నేదురుమిల్లి కుటుంబంపై ఉన్న సానుభూతితో పాటు వైసీపీ ఓటు బ్యాంకు తన గెలుపు నల్లేరు మీద నడకేనన్న ధీమాలో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ ప్రత్యర్థిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
వైఎస్ షర్మిల : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఈమె ఈసారి బరిలోకి దిగారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని పెట్టి అక్కడ పార్టీని కాంగ్రెస్ లో విలీనంచేసిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. కడప పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గెలుపు అనేది కష్టమేనని చెబుతున్నారు. తన తండ్రి ఆశయాలతో పాటు తన కుటుంబ నేపథ్యం తనను పార్లమెంటు సభ్యురాలిగా ఎంపిక చేస్తుందన్న ఆశతో షర్మిల ఉన్నారు. ఇలా ఆరుగురు మాజీముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తె ఈఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్ ను పరీక్షించు కుంటున్నారు. మరి జూన్ 4వ తేదీన కాని ఈ మాజీ సీఎం పుత్రరత్నాల పరిస్థితి ఏంటో తెలియదు.