డిప్రెషన్‌తో బాధపడుతున్న, మధ్య తరగతి యువతులతో స్నేహం చేసుకుని, వారినుంచి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించి వేధింపులకు గురి చేస్తున్న యువకుడ్ని గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ ఏషియన్ యువతులను ఆన్‌లైన్ ద్వారా వేధించినట్లు గుర్తించారు. గురువారం కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన జతిన్ భరద్వాజ్ ‘‘టాక్ లైఫ్’’అనే యాప్‌ను ఉపయోగించేవాడు. ఆ యాప్ ద్వారా డిప్రెషన్‌తో బాధపడుతున్న, మధ్య తరగతి యువతులను గుర్తించి, వారిని టార్గెట్ చేసేవాడు. ఇలా దాదాపు 15 మందితో స్నేహం చేసుకున్నాడు.
వీరిలో ముగ్గురి వద్దనుంచి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించాడు. అనంతరం వాటిని డబ్బులకు విక్రయించాడు. మరిన్ని చిత్రాలు, వీడియోలు పంపక పోతే వాటిని ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో భరద్వాజ్ వేధింపులు తట్టుకోలేక ఓ ఇండోనేషియా మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కాల్ లిస్ట్, సిమ్ కార్డు ఓనర్‌షిప్‌తో భరద్వాజను అరెస్ట్ చేశారు.