tdp-bjp-jana
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఆ రెండింట్లో… పుంజుకున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన భీమవరం, గాజువాక ఈసారి కొంత టీడీపీకి ఎడ్జ్ ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగారు. అప్పుడు త్రిముఖ పోటీ జరిగింది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో జనేనాని ఓటమి పాలయ్యారు. ఆయన తొలిసారి రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగడం, రెండు చోట్ల ఓటమి పాలు కావడం ఆయన కూడా ఊహించలేదు. దీంతో ఆయన తన ప్రత్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఈ ఐదేళ్ల పాటు ఎదుర్కొనాల్సి వచ్చింది. అయితే ఈసారి పవన్ కల్యాణ‌్ రెండు చోట్ల పోటీచేయలేదు. ఒకే ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పిఠాపురం నుంచి మాత్రమే ఆయన పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే ఇప్పుడు గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు ఇప్పుడు ఎవరు గెలుస్తారన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. రెండు స్థానాల్లోనూ కూటమి పార్టీ అభ్యర్థులకు అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడు తున్నాయి. పవన్ పోటీ చేసినప్పుడు ఓట్లు చీలిపోయి ఆయనను విజయానికి చేరువ చేయనివ్వలేదు.

అయితే ఈసారి పవన్ కాకపోయినా అక్కడ కూటమి అభ్యర్థులు కావడంతో ప్రధాన సామాజికవర్గాల ఓట్లు చీలిపోకుండా చూసుకోవడంలో కూటమి అభ్యర్థులు సక్సెస్ అయ్యారంటున్నారు. ఫలితాలు వచ్చినతర్వాత తెలుస్తుంది కానీ ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం అయితే రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులకే విజయావకాశాలున్నాయంటున్నారు. గాజువాక నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ ఈసారి మంత్రి గుడివాడ అమర్‌నాధ్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ పోటీ నువ్వా? నేనా? అన్న రీతిలో సాగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. గాజువాక నియోజకవర్గం కావడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపారన్న దానిపై గెలుపో టములు ఆధారపడి ఉంటాయి. మరో వైపు సామాజికవర్గాల పరంగా ఇద్దరూ బలమైన నేతలు. పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజికవర్గం నేత కాగా, గుడివాడ అమర్‌నాధ్ కాపు సామాజికవర్గం నేత. అయితే ఈసారి పల్లా కు కొంత సానుకూలత ఉందని చెబుతున్నారు.

అదే సమయంలో యువకుడు కావడంతో గుడివాడ గెలుపును కూడా కొట్టిపారేయలేమన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తుంది. టీడీపీతో బీజేపీ కలవడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు పల్లా వైపు మొగ్గు చూపకపోతే మాత్రం గుడివాడ గెలుపు ఖాయమయినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. . అలాగే మరో నియోజక వర్గమైన భీమవరంలో కూడా అంతేపరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ దాదాపు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు. కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా పులవర్తి ఆంజనేయులు బరిలో ఉన్నారు. ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి మారి సీటు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనూ 55 వేల ఓట్లను టీడీపీ తరుపున పోటీ చేసి తెచ్చుకున్నారు. అయితే ఇద్దరూ కాపు సామాజికవర్గం నేతలే. అయితే క్షత్రియ సామాజికవర్గంలో అధిక శాతం మంది ఈసారి కొంత జనసేన వైపు మొగ్గు చూపినట్లు అంటున్నారు.

అదే సమయంలో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడంతో గ్రంథి శ్రీనివాస్ విజయాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు. మొత్తం మీద గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పోటీచేసి ఓటమిపాలయని గాజువాక, భీమవరంలో ఈసారి కూడా టఫ్ ఫైట్ నడుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.